KTR:హైదరాబాద్‌లో ఆంధ్రా పంచాయతీ ఎంటీ .. ఆందోళనలకు అనుమతివ్వం, లోకేష్‌కు ఇదే చెప్పా : తేల్చేసిన కేటీఆర్
Send us your feedback to audioarticles@vaarta.com
స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన నాటి నుంచి ఆ పార్టీ శ్రేణులు ఏపీతో పాటు పలు ప్రాంతాల్లో ఆందోళనలు, ధర్నాలు నిర్వహించారు. హైదరాబాద్, బెంగళూరులలో ఏకంగా ఐటీ ఉద్యోగులు రోడ్లెక్కడం కీలక పరిణామం. ఒక్క మాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్‌లో కంటే బయటి ప్రాంతాల్లోనే ఎక్కువగా చంద్రబాబు కోసం ఆందోళనలు నడిచాయి. ముఖ్యంగా హైదరాబాద్ ఎక్కువగా ఫోకస్ అవుతోంది. టీడీపీ సానుభూతిపరులు, చంద్రబాబు సామాజిక వర్గం ఎక్కువగా వున్న ప్రాంతం కావడంతో పాటు విశ్వనగరం కావడంతో మీడియా ఫోకస్ ఎక్కువగా వుంటుంది. అయితే ఇకపై హైదరాబాద్‌లో ర్యాలీలు, సభలు, సమావేశాలు చేస్తామంటే కుదరదని తేల్చిచెప్పేశారు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.
లోకేష్ నాకు ఫోన్ చేశారు :
మంగళవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో ర్యాలీకి ఎందుకు అనుమతి ఇవ్వలేదని లోకేష్ స్వయంగా తనకు ఫోన్ చేసినట్లు చెప్పారు. ఇది ఏపీలోని రెండు రాజకీయ పార్టీలకు చెందిన అంశమని.. అలాంటప్పుడు తెలంగాణలో చేయడం ఏంటీ, అవసరమైతే అక్కడే చేసుకోవచ్చు కదా అని తాను ప్రశ్నించినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఐటీ ఇండస్ట్రీ డిస్ట్రబ్ కావడానికి వీల్లేదని.. ఇక్కడి ఉద్యోగులకు చెప్పేది ఒక్కటే.. తెలంగాణలో ఎలాంటి ఆందోళనలు చేయొద్దని మంత్రి తేల్చి చెప్పేశారు.
ఐటీ డిస్ట్రబ్ కావడానికి వీల్లేదు :
ఇక్కడ పనిచేసే ఉద్యోగులు అనవసర రాజకీయాల్లోకి వచ్చి కెరీర్ పాడు చేసుకోవద్దని, తెలంగాణకు ఏపీ రాజకీయాలు అంటించొద్దని కేటీఆర్ సూచించారు. మాకు రాజకీయాల కంటే శాంతి భద్రతలే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. ఏపీ రాజకీయాల పేరుతో తెలంగాణ ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని కేటీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్ట్‌పై విజయవాడ, రాజమండ్రి, అమరావతిలో ఆందోళనలు చేసుకోవాలని.. ఆంధ్రా పంచాయతీ, ఆంధ్రాలోనే తేల్చుకోవాలని మంత్రి ఫైర్ అయ్యారు. వేలమంది ఆంధ్రా సోదరులు తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నారని.. ఉద్యమం సమయంలోనూ ఐటీ సెక్టార్లో ఎలాంటి ఆందోళనలు జరగలేదని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు.
చంద్రబాబు అరెస్ట్‌పై బీఆర్ఎస్ తటస్థం:
ఒకరికి అనుమతిస్తే వేరే పార్టీకి కూడా అనుమతి ఇవ్వాల్సి వస్తుందని.. పోటాపోటీ ఆందోళనలు జరిగితే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని మంత్రి పేర్కొన్నారు. వైసీపీ, టీడీపీలకు తెలంగాణలో ప్రాతినిథ్యం లేదని.. అలాంటప్పుడు హైదరాబాదీలను రెండు పార్టీలు ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. మా పార్టీ నేతలు స్పందిస్తే అది వారి వ్యక్తిగతమని.. తాము తటస్థంగానే వుంటానని.. తాను వ్యక్తిగతంగా లోకేష్, జగన్, పవన్ కళ్యాణ్‌లకు మిత్రుడినని కేటీఆర్ వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments