KTR:హైదరాబాద్ సిగలో మరో మణిహారం.. వీఎస్టీ స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించిన కేటీఆర్, ఎన్ని ప్రత్యేకతలో

  • IndiaGlitz, [Saturday,August 19 2023]

హైదరాబాద్ సిగలో మరో మణిహారం చేరింది. దక్షిణ భారతదేశంలోనే అతి పొడవైన స్టీల్ బ్రిడ్జ్ (వీఎస్టీ-ఇందిరా పార్క్)ను తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చాక హైదరాబాద్ నగరంలో ప్రారంభించిన ఫ్లై ఓవర్లలో ఇది 36వది అన్నారు. కార్మిక నేతగా, శాసనసభ్యుడిగా, మంత్రిగా ప్రజలకు సేవలందించిన దివంగత నాయిని నర్సింహారెడ్డి పేరును ఈ స్టీల్ బ్రిడ్జ్‌కు సీఎం కేసీఆర్ ఆదేశించారని కేటీఆర్ తెలిపారు. లోయర్ ట్యాంక్ బండ్, అప్పర్ ట్యాంక్ బండ్‌ను కలిపి అద్భుతంగా మారుస్తామని మంత్రి వెల్లడించారు. ఇదే సమయంలో విపక్షనేతలపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కొందరు మతం పేరుతో తెలంగాణలో చిచ్చుపెట్టాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కేసీఆరే మళ్లీ సీఎం అవుతారని , 2023లో ప్రతిపక్షాలకు సినిమా చూపిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.

స్టీల్ బ్రిడ్జి ప్రత్యేకతలు :

రూ.450 కోట్ల ఖర్చుతో జీహెచ్ఎంసీ ఈ బ్రిడ్జిని నిర్మించింది దేశంలోనే తొలిసారిగా మెట్రో బ్రిడ్జిపై నుంచి ఫ్లై ఓవర్ చేపట్టారు.

ఈ స్టీల్ బ్రిడ్జ్ వలన ఇందిరా పార్క్ నుంచి వీఎస్‌టీ స్టీల్ ఫ్లై ఓవర్ వలన రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది

ఆర్‌టీసీ క్రాస్ రోడ్డు , ఉస్మానియా యూనివర్సిటీ, హిందీ మహా విద్యాలయం వరకు విపరీతమైన ట్రాఫిక్ రద్దీ పోతుంది

ఇందిరా పార్క్, అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ట్రాఫిక్ సమస్య లేకుండా లింగంపల్లి వీఎస్‌టీ జంక్షన్ వరకు సులభంగా చేరుకోవచ్చు.

ఈ ఫ్లైఓవర్ పొడవు 2.62 కిలోమీటర్లు , వెడల్పు 16.61 మీటర్లు స్టీల్ బ్రిడ్జి మొత్తం పిల్లర్లు 81

ఇకపోతే.. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 45 ఫ్లై ఓవర్లకు శ్రీకారం చుట్టగా.. 35 పనులు పూర్తయ్యాయి. వీటిలో 19 ఫ్లైఓవర్లు, 5 అండర్‌పాస్‌లు, 7 ఆర్‌ఓబీ, ఆర్‌యూబీలు, 1 కేబుల్ స్టయిడ్ బ్రిడ్జి, పంజాగుట్ల స్టీల్ బ్రిడ్జి, పంజాగుట్ట రోడ్డు వెడల్పు పనులు పూర్తయ్యాయి. మిగిలిన 12 పనులు 2023 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది.