బండి సంజయ్‌పై పరువు నష్టం దావా వేసిన కేటీఆర్.. క్షమాపణలకు డిమాండ్, 48 గంటలు డెడ్‌లైన్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో బీజేపీ దూకుడుతో రాజకీయం వేడెక్కిన సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు జాతీయ నేతలను రప్పిస్తూ కమలం పార్టీ టీఆర్ఎస్‌కు సవాల్ విసురుతోంది. అటు రాష్ట్ర బీజేపీ నేతలు సైతం అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నారు. ప్రతిరోజూ ఇరు పార్టీల నేతలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఈ విమర్శలే చివరికి న్యాయస్థానం మెట్లు ఎక్కే వరకు వచ్చాయి. ఈ మేరకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌పై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు తన న్యాయవాది చేత శుక్రవారం బండి సంజయ్‌కి కేటీఆర్ నోటీసులు పంపించారు. కేటీఆర్ పాపులారిటీని దృష్టిలో ఉంచుకొని, ఆయనపై నిరాధారమైన ఆరోపణలు చేసి ప్రచారం పొందాలనే దురుద్దేశంతోనే సంజయ్ అవాస్తవాలు చెప్పారని నోటీసుల్లో న్యాయవాది తెలిపారు.
ఒక జాతీయ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ ప్రజా జీవితంలో కనీస ప్రమాణాలు పాటించచలేదని నోటీసులో ఆరోపించారు. కేవలం ప్రచారం పొందాలన్న ఉద్దేశంతోనే ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల అంశాన్ని కేటీఆర్‌కు ఆపాదించే ప్రయత్నం చేశారని కేటీఆర్ న్యాయవాది ఆరోపించారు. కేటీఆర్ పరువుకు భంగం కలిగించేలా, అసత్య వ్యాఖ్యలు చేసిన సంజయ్.. సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం కేటీఆర్‌కు పరిహారం చెల్లించాలని పేర్కొన్నారు. వీటితో పాటు చట్ట ప్రకారం తగిన చర్యలకు అర్హులవుతారని నోటీసుల్లో న్యాయవాది తెలిపారు. 48 గంటల్లో కేటీఆర్‌కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని న్యాయవాది నోటీసులో డిమాండ్ చేశారు.
కాగా.. కేటీఆర్ నిర్వాకం వల్ల రాష్ట్రంలో 27 మంది విద్యార్ధులు మరణించారని ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల విద్యార్ధులు చనిపోతే కేసీఆర్ సర్కార్ కనీసం పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. అయితే బండి సంజయ్ ఆరోపణలపై కేటీఆర్ తక్షణమే స్పందించారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకొంటానని అప్పుడే హెచ్చరించారు. దీనిలో భాగంగా ఇవాళ నోటీసులు పంపారు కేటీఆర్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments