నాగార్జున సినిమా అయినా.. పవన్ సినిమా అయినా మాకు ఒకటే: విమర్శలకు కొడాలి నాని కౌంటర్

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాకు ఏపీ ప్రభుత్వం నుంచి గట్టి అవరోధాలు ఎదురైన సంగతి తెలిసిందే. టికెట్ల ధరలు పెంచకపోవడం, బెనిఫిట్ షోకు అనుమతి ఇవ్వకపోవడంతో పవన్ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. దీంతో జగన్ సర్కార్‌పై ట్రోలింగ్‌కు దిగారు జగన్‌ ప్రభుత్వం పవన్‌ కల్యాణ్ సినిమాలపై కక్షగట్టిందని .. థియేటర్లపై ఆంక్షలు, థియేటర్ యాజమాన్యాలకు వార్నింగ్‌లు, అదనపు షోకి పర్మిషన్ నిరాకరణ.. ఇవన్నీ కక్ష సాధింపు చర్యలేనంటూ ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి కొడాలి నాని స్పందించారు. పవన్‌ కల్యాణ్‌పై టీడీపీ నేతలు విపరీతమైన ప్రేమ చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘భీమ్లా నాయక్‌’ను సీఎం జగన్‌ తొక్కేశారని.. పవన్‌పై జగన్‌ యుద్ధం అంటూ ప్రచారం చేస్తున్నారని కొడాలి నాని మండిపడ్డారు. ఫిబ్రవరి 25న జీవో ఇస్తామని.. సినిమా టికెట్‌ రేట్లు పెంచుకోమని తమ ప్రభుత్వం, పార్టీ ఎక్కడా చెప్పలేదని మంత్రి గుర్తుచేశారు. సినీ పరిశ్రమను రాష్ట్రానికి తీసుకురావాలంటే ఏ నిర్ణయాలు తీసుకోవాలి.. పాన్‌ ఇండియా సినిమాలకు రేట్లు ఎలా ఉండాలి? తదితర అంశాలపై టాలీవుడ్ ప్రముఖులతో జగన్ చర్చించారని కొడాలిని నాని వెల్లడించారు.

టికెట్ల ధరలపై కోర్టు నియమించిన కమిటీ, ప్రభుత్వం, సినీ పెద్దల అభిప్రాయం.. ఇలా మూడింటినీ చూసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు నిర్ణయంపై న్యాయ సలహా కోరి వారి అభిప్రాయం తీసుకోవాలి. ఈ క్రమంలో మంత్రి గౌతమ్‌రెడ్డి మరణించడంతో కొంత ఆలస్యమైందని నాని చెప్పారు. ఈ విషయాలన్నీ ‘భీమ్లా నాయక్‌’ నిర్మాతలకు, సినీ పెద్దలకు, పవన్‌ కల్యాణ్‌కు తెలుసునని మంత్రి పేర్కొన్నారు. అయినా రాజకీయాల కోసం అర్ధాంతరంగా రిలీజ్ డేట్ ప్రకటించి.. విడుదల చేశారని కొడాలి నాని ఆరోపించారు.

అటు ఎంత పెద్దవారైనా వంగివంగి నమస్కారాలు పెడితేనే జగన్‌ అహం సంతృప్తి చెందుతుందంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరంజీవిని జగన్‌ తన ఇంటికి ఆహ్వానించారని.. సీఎం సతీమణి భారతి భోజనం పెట్టి పంపిన విషయాన్ని పవన్‌ మర్చిపోయారా? అంటూ కొడాలి నాని ప్రశ్నించారు. సీఎం కూడా ఇంటి నుంచి నడుచుకుంటూ క్యాంపు ఆఫీస్‌కి వస్తారని... మంత్రులు కూడా సెక్యూరిటీ చెక్‌ తర్వాతే లోపలికి వెళ్తారని, అలాంటిది లోపలికి కారు రానీయకుండా అవమానించారంటూ ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాలు, రాజకీయాలను వేరు చేసి చూడాలని.. ప్రతి దానిని రాజకీయాలకు వాడుకోవద్దని కొడాలి నాని సూచించారు. జగన్‌కు మిత్రుడైన నాగార్జున సినిమాకైనా.. రాజకీయ ప్రత్యర్ధి అయిన పవన్ సినిమాకైనా ఒకటే రూలు వుంటుందని మంత్రి గుర్తుచేశారు.