Gudivada Amarnath:ముందు నీ తమ్ముడికి చెప్పుకో.. అన్నీ మురికి మాటలే : చిరంజీవికి మంత్రి గుడివాడ అమర్‌నాథ్ కౌంటర్
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి గుడివాడ అమర్‌నాథ్. సినిమాను సినిమాగా చూడాలని చెబుతున్న మెగా ఫ్యామిలీ .. మరి సినిమాను సినిమాగా ఎందుకు తీయడం లేదని ఆయన చురకలంటించారు. మంత్రి అంబటి రాంబాబును కించపరిచేలా సన్నివేశాలను ఎందుకు పెట్టారు.. దీనికి సమాధానం చెప్పాలంటూ చిరంజీవిని అమర్‌నాథ్ నిలదీశారు. అవసరం లేకపోయినా బ్రో సినిమాలో అంబటి రాంబాబు స్పూఫ్ క్యారెక్టర్‌ను పెట్టారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాలను రాజకీయాల్లోకి లాగొద్దని చెబుతూ.. అలా తీసుకొచ్చేది పవన్, చిరంజీవిలేనంటూ గుడివాడ ఎద్దేవా చేశారు. ముందు తమ్ముడికి చెప్పుకోవాలని.. మురికి మాటలు మాట్లాడే పవన్ నోటిని కడుగుతారో, లేక ఒంటిని కడుగుతారో, ఇంకేమైనా కడుగుతారో అది చిరంజీవి ఇష్టమని అమర్‌నాథ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ అంటే తనకు ప్రత్యేకమైన గౌరవమని.. దానిని నిలబెట్టుకోవాలని గుడివాడ హితవు పలికారు.
టీడీపీ కార్యకర్తల ప్రాణాలు తీయాలన్నదే బాబు ప్లాన్ :
పనిలో పనిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపైనా అమర్‌నాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పుంగనూరులో తమ పార్టీ నాయకుల ప్రాణాలను బలిచేసి రాజకీయంగా లాభంపొందాలని చంద్రబాబు భావించారని ఆయన ఆరోపించారు. ఎస్పీ, డీజీపీపై విమర్శలు చేస్తున్నారని గుడివాడ ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్ ప్లస్ కేటగిరి భద్రత అందుకునే వ్యక్తి ముందుగా తన పర్యటన వివరాలు తెలియజేయాలని.. కానీ టీడీపీ కార్యకర్తల ప్రాణాలు తీయాలన్నది చంద్రబాబు కుట్ర అని అమర్‌నాథ్ ఆరోపించారు.
లోకేష్ తల, నాలుకకు ఆపరేషన్ చేయించాలి :
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పైనా గుడివాడ మండిపడ్డారు. పాదయాత్రలో లోకేష్ రెడ్ బుక్ ఏంటో తనకు అర్ధం కావడం లేదని.. సీఎం వైఎస్ జగన్‌ను, పోలీసులను ఆయన దూషిస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల కంటికి గాయమైంది అంటే తాను ఆపరేషన్ చేయిస్తానని అంటున్నారని.. ముందు లోకేష్ తల, నాలుకకు ఆపరేషన్ చేయించాలని అమర్‌నాథ్ చురకలంటించారు. రాజకీయ లబ్ధి కోసం ఏమైనా చేస్తామంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని గుడివాడ అమర్‌నాథ్ హెచ్చరించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments