Dharmana: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయడం లేదు.. మంత్రి ధర్మాన క్లారిటీ..
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో ఎన్నికల వేళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఆ చట్టం ద్వారా రైతుల భూములు, ఆస్తులు లాక్కునేందుకు వైసీపీ నేతలు కుట్రపన్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. దీంతో రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పందించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావాలన్నది బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయమని తెలిపారు. ఈ చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి తీసుకువస్తూనే ఉందని పేర్కొన్నారు. అలాంటి బీజేపీతో టీడీపీ జట్టుకట్టి వక్రభాష్యాలు చెబుతుందని మండిపడ్డారు .
రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయమని ఎప్పుడో చెప్పామని ధర్మాన స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఈ చట్టంపై ఏకాభిప్రాయం వచ్చిన తర్వాతే అమలు చేసే ఆలోచన చేస్తామని ప్రకటించారు. తమ పాలనలో రైతులకు మేలు చేసేలా అనేక సంస్కరణలు చేశామన్నారు. సమగ్ర సర్వే ద్వారా ఎంతో మేలు చేకూరుతోందని.. అత్యాధునిక టెక్నాలజీని ఈ సర్వే కోసం వినియోగించామన్నారు. దీనివల్ల భూరికార్డులు అప్ టు డేట్‌గా ఉంటాయని స్పష్టం చేశారు. రికార్డులు మొత్తం కంప్యూటరీకరణతో పాటు ఆటోమేటిగ్గా మ్యుటేషన్ జరుగుతుందన్నారు.
ప్రభుత్వం ఇంత చేస్తుంటే.. ప్రతిపక్ష నేతలు మాత్రం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్ భూములు తీసుకునేవాడా? భూములు పంచేవాడా? అనేది ఈ ఐదేళ్ల పాలనే చెబుతుందన్నారు. 26 లక్షల ఎకరాలపై నిరుపేదలకు సర్వహక్కులు కల్పించింది జగన్ కాదా అని ప్రశ్నించారు. అలాంటి జగన్ మీకు భూములు తీసుకునేవాడిలా కనిపిస్తున్నాడా..? అని ప్రశ్నించారు. పేదలకు 31 లక్షల ఇళ్లపట్టాలు ఇచ్చిన జగన్ మీకు భూమిని లాక్కునేవాడిలా కనిపిస్తున్నాడా..? అని నిలదీశారు.
రాష్ట్రంలో ప్రజలంతా అమయాకులని అనుకుంటున్నారా.. మీరేం చెప్తే అది నమ్ముతారన్న భ్రమలో ఉన్నారా అని ధర్మాన ప్రశ్నించారు. ప్రజల భూములు తీసుకుని వ్యాపారాలు తీసుకునే భావజాలం చంద్రబాబుది అయితే.. భూములను నిరుపేదలకు పంచాలన్న భావజాలం జగన్‌ది అన్నారు. దీనిపై ఎక్కడైనా తాను చర్చకు సిద్ధమని ధర్మాన సవాల్ విసిరారు. కాగా రైతుల భూములు లాక్కొనేందుకు అధికార వైసీపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువచ్చిందని ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments