మంత్రి వెల్లంపల్లికి మళ్లీ అస్వస్థత.. ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు..
- IndiaGlitz, [Thursday,October 15 2020]
దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మరోసారి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన కోలుకున్నట్టే కోలుకుని తిరిగి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో అత్యవసర చికిత్స నిమిత్తం హుటాహుటిన ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయనకు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స జరుగుతున్నట్టు సమాచారం. మంత్రి వెలంపల్లికి కరోనా తిరగబెట్టిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా సీరియస్‌గా ఉందని తెలుస్తోంది.
గత నెలలో తిరుమలలో జరిగిన బ్రహ్మోత్సవాల్లో ఆయన కొద్దిరోజులపాటు అక్కడే ఉన్నారు. సీఎం జగన్ ఇతర వైసీపీ నేతలతో కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆయన తిరుమల నుంచి రాగానే కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకోగా.. పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. విజయవాడలోని ప్రైవేటు ఆస్పతిల్రో వారం రోజులకు పైగా చికిత్స తీసుకున్నారు. అనంతరం కరోనా నుంచి కాస్త కోలుకున్నారు. అనంతరం పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో సైతం వెల్లంపల్లి పాల్గొన్నారు.
ఈ నెల 17 నుంచి నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో 21న మూలానక్షత్రం రోజున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించాలని కోరుతూ 2 రోజుల క్రితమే దుర్గగుడి అధికారులతో కలిసి మంత్రి వెల్లంపల్లి కూడా సీఎం జగన్‌ను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఇంతలోనే ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడం.. వెంటనే హైదరాబాద్‌కు తరలించడం చకచకా జరిగిపోయాయి.