AP DSC Notification: డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
- IndiaGlitz, [Monday,February 12 2024]
డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పరీక్షల షెడ్యూల్ రిలీజ్ చేశారు. 6,100 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. డీఎస్సీ పరీక్ష నిర్వహణ కోసం https://apdsc.apcfss.in/ పేరుతో అధికారిక వెబ్ సైట్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. నోటిఫికేషన్, వివిధ కేటగిరీల వారీగా ఖాళీలు, దరఖాస్తుల స్వీకరణ, ఫీజు చెల్లింపు, ముఖ్యమైన తేదీలు, ఇతర వివరాల సమాచారం ఇందులో అందుబాటులో ఉంటాయి. అలాగే cse.ap.gov.in వెబ్‌సైట్‌లోనూ వివరాలు తెలుసుకోవచ్చు.
ఇక ఉమ్మడి జిల్లాల వారీగా ఖాళీలను పరిశీలిస్తే.. శ్రీకాకుళం జిల్లాలో 283, విజయనగరం జిల్లాలో 284, విశాఖపట్నం 329, తూర్పు గోదావరి 392, పశ్చిమగోదావరి 306, కృష్ణా 279, గుంటూరు 416, ప్రకాశం 503, నెల్లూరు 346, చిత్తూరు 336, కడప 386, కర్నూలు జిల్లాలో 1693 పోస్టులున్నాయి. ఈ పోస్టులతో పాటు పీజీటీ 215, ప్రిన్సిపాల్ పోస్టులు 42.. విద్యాశాఖలో ఎస్టీజీ పోస్టులు 2,000, గిరిజన సంక్షేమ శాఖలో 280 పోస్టులున్నాయి. విద్యాశాఖలో స్కూల్ అసిస్టెంట్లు 2,060, గిరిజన శాఖలో 226 ఉన్నాయి. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని రెసిడెన్షియల్ స్కూళ్లలో 13 పోస్టులున్నాయి.
నేటి నుంచి ఈనెల 22 వరకూ దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ నెల 21 వరకు ఫీజు చెల్లింపునకు గడువు ఇచ్చారు. ఇక మార్చి 5 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంది. మార్చి 15 నుంచి 30 వరకూ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి 12 గంటల వరకు ఒక సెషన్‌గా...మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండవ సెషన్‌గా పరీక్షలు నిర్వహిస్తారు.
మార్చి 31న ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల చేయనుండగా.. అభ్యంతరాలు తెలిపేందుకు ఏప్రిల్ 1 వరకూ అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 2న తుది ఆన్సర్ కీ.. ఏప్రిల్ 7న ఫలితాలు విడుదల చేస్తారు. కాగా 2018 సిలబస్ ప్రకారమే డీఎస్సీ పరీక్షల నిర్వహణ ఉంటుంది. అలాగే జనరల్ అభ్యర్ధులకు 44 ఏళ్లు గరిష్ట వయోపరిమితిగా నిర్ణయించగా.. రిజర్వుడు అభ్యర్ధులకు మరో ఐదేళ్ల వెసులుబాటు కల్పించారు.