Botsa Satyanarayana:ఫిల్మ్ ఇండస్ట్రీ పిచ్చుక అని ఒప్పుకున్నారా .. చిరంజీవి వ్యాఖ్యలకు బొత్స సత్యనారాయణ కౌంటర్
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు వైసీపీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ. సినీ పరిశ్రమ ఓ పిచ్చుక అని చిరంజీవి ఒప్పుకున్నారా అని మంత్రి ప్రశ్నించారు. ఏపీలో వున్న ప్రజలందరికీ వాలంటీర్ల ద్వారా పథకాలు అందుతున్నాయని , అయినప్పటికీ చిరు ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారని బొత్స నిలదీశారు. తాము వారాహీ యాత్రను అడ్డుకోమని.. కానీ యాత్రల పేరుతో చట్టాలను చేతుల్లోకి తీసుకుంటే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా యాత్రలు చేసుకోవచ్చని బొత్స సత్యనారాయణ తెలిపారు. విశాఖలో తాను చేయబోయే వారాహి యాత్రపై దేశమంతా చర్చ జరుగుతుందని పవన్ కల్యాణ్ అంటున్నారని, అంటే పుంగనూరులో మాదిరిగా విధ్వంసం చేయాలని చూస్తున్నారా అని మంత్రి ప్రశ్నించారు.
చిరంజీవి ఏమన్నారంటే :
బాబీ దర్శకత్వంలో చిరంజీవి, రవితేజ నటించిన వాల్తేర్ వీరయ్య సినిమా థియేటర్లలో 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వంపై ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వం, ప్రభుత్వాధినేతలు, అధికారులు పెద్ద పెద్ద విషయాలపై దృష్టి పెట్టాలని చిరంజీవి సూచించారు. మంచి ఫలితాలు రప్పించేలా పనిచేయాలని, ప్రత్యేక హోదా, లేదంటే సాగునీటి ప్రాజెక్ట్‌ల గురించి కానీ.. లేదా రోడ్ల నిర్మాణాల గురించి కానీ, పేదవాళ్ల ఆకలి తీర్చే పథకాలపై దృష్టి పెట్టాలని చిరంజీవి సూచించారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెడితే అంతా సంతోషిస్తారని చిరంజీవి పేర్కొన్నారు. కానీ అవన్నీ వదిలేసి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం మాదిరిగా సినిమా ఇండస్ట్రీపై పడితే ఎలా.. ఇలాంటి పనులు మానుకోవాలని మెగాస్టార్ పేర్కొన్నారు.
200 రోజుల షీల్డ్ అందుకోవడం ఆనందంగా వుంది:
ఇంకా చిరంజీవి ఏమన్నారంటే.. ఆ రోజుల్లో సినిమాలు 100 రోజులు, 200 వందల రోజులు, సిల్వర్ జూబ్లీలు, గోల్డెన్ జూబ్లీలు ఆడేవన్నారు. కానీ ఇప్పుడు ఆ రోజులు పోయాయని.. కానీ ఇప్పుడు రెండు వారాల్లోనే సినిమా జర్నీ ముగుస్తోందని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటిది వాల్తేరు వీరయ్య 200 రోజులు ఆడటం సాధారణ విషయం కాదని, అప్పటి మాదిరిగా షీల్డ్స్ తీసుకోవడం ఆనందంగా వుందని చిరు అన్నారు. పాత రోజులు రిపీట్ అవుతాయా అనే అనుమానాలు, సందేహలు వుండేవని, కానీ అంతా కష్టపడి ఇది సాధ్యమేనని నిరూపించారని మెగాస్టార్ ప్రశంసించారు. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్, రవిశంకర్, చెర్రీకి చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments