Botsa Satyanarayana:ఏపీ డేటా హైదరాబాద్‌లో వుందన్న పవన్ కల్యాణ్ .. గాలి మాటలంటూ జనసేనానికి బొత్స కౌంటర్
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ సీఎం వైఎస్ జగన్ , వైసీపీ నేతలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ ఆయన పార్ట్నర్ హైదరాబాద్‌లో మాత్రమే వుంటారంటూ ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటాను హైదరాబాద్‌లో వుంచాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఏ డేటా ఎక్కడ వుందో పవన్ కల్యాణ్‌కు తెలుసా అని ఆయన ప్రశ్నించారు. ప్రజల డేటా ప్రభుత్వం దగ్గర వుంటుందని.. పవన్ గాలి మాటలు మాట్లాడుతున్నారని బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్ అంటే ఎవరు, అతని విధివిధానాలు తెలుసా అని ఆయన ప్రశ్నించారు. మహిళలపై పవన్ కల్యాణ్ అసభ్యకరంగా మాట్లాడుతున్నారని .. వాలంటీర్ల వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తోందనే అక్కసుతోనే పవన్ ఈ వ్యాఖ్యలు చేశారంటూ దుయ్యబట్టారు.
చంద్రబాబు హయాంలో ఓట్లు తొలగించారు :
చంద్రబాబు నాయుడు సీఎంగా వున్నప్పుడు సర్వే పేరుతో డేటా సేకరించి ఓటర్ల లిస్ట్‌లో పేర్లు తొలగించారని బొత్స సత్యనారాయణ ఈ సందర్భంగా గుర్తుచేశారు. దీనిపై అప్పుడు తానే డీజీపీకి ఫిర్యాదు చేశానని.. అప్పట్లో చంద్రబాబుకు సన్నిహితంగా వున్న సంగపూర్ మంత్రిని అరెస్ట్ చేశారని బొత్స తెలిపారు. అతనిని తీసుకొచ్చి అమరావతిలో చంద్రబాబు భారీ ప్రచారం చేశారని ఆయన చురకలంటించారు. అన్ని రాష్ట్రాలు వాలంటీర్ వ్యవస్థను తీసుకురావాలని చూస్తుంటే.. పవన్ మాత్రం వాళ్లని అడ్డం పెట్టుకుని పవన్ బురద జల్లాలని చూస్తున్నారని బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్ల గురించి ఏ నిఘా వర్గాలు సమాచారం ఇచ్చాయో పవన్ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.
నానక్‌రామ్ గూడలో ఏపీ డేటా వుందన్న పవన్ :
కాగా.. వారాహి విజయయాత్రలో భాగంగా బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 6 కోట్ల మంది ప్రజల సమాచారం హైదరాబాద్ నానక్‌రామ్ గూడ ప్రాంతంలోని ఎఫ్ఓఏ అనే ఏజెన్సీ వద్ద వున్నారు. అక్కడ పనిచేస్తున్న 700 మంది సిబ్బంది ప్రజల డేటాతో ఏం చేస్తున్నారు.. వారికి వేతనాలు ఎవరు చెల్లిస్తున్నారు అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. రెడ్‌క్రాస్ వాలంటీర్లకు రాష్ట్రపతి, రాష్ట్రాల గవర్నర్లు అధిపతులని.. మరి ఏపీలోని వాలంటీర్ వ్యవస్థకు అధిపతి ఎవరని పవన్ నిలదీశారు. వాలంటీర్లు ఏదో చేసేస్తారు.. పథకాలు ఆగిపోతాయని అనుకోవద్దని, ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout