Botsa Satyanarayana:బైజూస్‌పై విమర్శలు .. పవన్.. నీకు ట్యూషన్స్ చెబుతా, ఈ హోంవర్క్ చేయ్ : బొత్స సెటైర్లు
- IndiaGlitz, [Monday,July 24 2023]
ఇప్పటికే వాలంటీర్లపై వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోన్న పవన్ కల్యాణ్.. నిన్న బైజూస్‌ను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మెగా డీఎస్సీని ప్రకటించలేదని.. ఒక్క టీచర్‌ని కూడా రిక్రూట్ చేయలేదని జనసేనాని మండిపడ్డారు. కానీ తీవ్ర నష్టాల్లో వున్న ఓ స్టార్టప్‌కు మాత్రం వందల కోట్లు కాంట్రాక్ట్‌లు ఇచ్చారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఈ కాంట్రాక్ట్‌ల విషయంలో స్టాండర్డ్ ప్రోటోకాల్‌ను వైసీపీ ప్రభుత్వం పాటించిందా అని ఆయన ప్రశ్నించారు. టెండర్‌లో ఎన్ని కంపెనీలు పాల్గొన్నాయి..? ఎవరెవరు షార్ట్ లిస్ట్ అయ్యారనే వివరాలను పబ్లిక్ డొమైన్‌లో వుంచారా అని పవన్ నిలదీశారు.
దీనిపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటుగా స్పందించారు. నేను నీకు ట్యూషన్ చెబుతానని.. కానీ ఎప్పటి హోంవర్క్ అప్పడు చేయాలంటూ ఆయన సెటైర్లు వేశారు. ముందుగా తాను ఏడు పాఠాలను చెబుతున్నానని.. ఆ హోంవర్క్ పూర్తి చేయాలంటూ ట్వీట్ చేశారు.
పాఠం 1 : పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ టెండర్లకు సంబంధించిన అర్హత లేదా పరిధిని నిర్ణయించే అధికారాన్ని అందించింది ఏపీ ప్రభుత్వం. ఇది ప్రపంచంలోనే తొలిసారి.
పాఠం 2 : రూ.100 కోట్లకు పైన వున్న ఏదైనా ప్రభుత్వ టెండర్ పరిధి, అర్హతని నిర్ణయించేది గౌరవ హైకోర్టు అనుమతితో నియమించిన స్పెషల్ జడ్జితోనే పాస్ అవుతుంది.
పాఠం 3 : టెండర్ స్పెసిఫికేషన్స్‌ను పబ్లిక్ డొమైన్‌లో వుంచుతారని.. కంపెనీలు తమ అభ్యంతరాలు తెలియజేయడానికి 21 రోజుల సమయం వుంటుంది. దీనిని పోస్ట్ చేసిన జడ్జి స్వయంగా టెండర్ స్పెసిఫికేషన్స్‌ను లాక్ చేస్తారు.
పాఠం 4 : ప్రపంచంలోనే జ్యూడిషియల్ ప్రివ్యూ వున్న ఏకైక ప్రభుత్వం మాదేనని చెప్పడానికి గర్వపడుతున్నాం.
పాఠం 5: గూగుల్‌లో సెర్చ్ చేయడం ద్వారా మీకు కావాల్సిన టెండర్ గురించి ప్రభుత్వాన్ని సంప్రదించిన అన్ని కంపెనీలు వివరాలు తెలుసుకోవచ్చు. ఆగస్ట్ 2022 నుంచి పబ్లిక్ డొమైన్‌లో వున్న వివరాలు తెలుసుకోవడానికి లింక్ ఇదిగో (https://judicialpreview.ap.gov.in/findings-recommendations/).
పాఠం 6 : రాష్ట్ర విద్యా శాఖ అత్యంత పారదర్శకమైన విభాగమని.. దీనికి నిదర్శనం మీరంతా చూసిన ఫలితాలే.
పాఠం 7 : ప్రజలను తప్పుదోవ పట్టించడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలను చూస్తే మీకు పాఠాలు చెప్పిన టీచర్ల పట్ల జాలి కలుగుతోంది. వారికి తాను క్షమాపణలు చెబుతున్నానంటూ బొత్స ట్వీట్ చేశారు.