పవన్ ఓటమికి అసలు కారణం చెప్పిన మంత్రి అనిల్!
- IndiaGlitz, [Saturday,November 02 2019]
ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా నవంబర్ 3న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ తలపెట్టిన సంగతి తెలిసిందే. అయితే మార్చ్‌పై వైసీపీ మంత్రులు, నేతలు సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ తీవ్ర విమర్శలు గుప్పించారు. మానసికంగా కృంగిపోయి టీడీపీ అధినేత చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నారని అనిల్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు మానసిక జబ్బుతో బాధపడుతున్నారని.. ఆయనకు ప్రతి విషయంలో దత్త పుత్రుడు పవన్ సాయం చేస్తున్నారన్నారు. ‘అబద్ధాన్ని పదే పదే చెబితే నిజమవుతుందని చంద్రబాబు నమ్ముతారు. గోబెల్స్ ప్రచారం కాదు... చంద్రబాబు ప్రచారం అంటే సరిపోతుంది. పవన్ ఎవరినైనా తిడతారు.. ఆయన్ని ఎవరైనా తిడితే తట్టుకోలేరు. చంద్రబాబు స్క్రీన్ ప్లేలో నడిచే పవన్ ఓడిపోయారని చెప్పుకొచ్చారు.
ఉనికి కోసమే బాబు, పవన్ తాపత్రయం!
‘ఇసుకలో అక్రమాలు జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఉనికి కోసమే చంద్రబాబు, పవన్‌కల్యాణ్ తాపత్రయం. ఇసుకను దాచుకోవాలని ఏ ప్రభుత్వం అనుకోదు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని జగన్ కష్ట పడుతున్నారు. ప్రజలు 23 సీట్లు ఇచ్చారు, చంద్రబాబు ఇప్పటికైనా మారాలి. చంద్రబాబును పవన్ ఐదేళ్లు మోశారు, ఇకనైనా కళ్లు తెరవాలి. టీడీపీ హయాంలో జరిగిన దారుణాలపై పవన్ ఎందుకు స్పందించలేదు..?. ఇసుక కొరతపై మార్చ్‌ను కృష్ణా, గోదావరి ఒడ్డున చేస్తే బాగుండేది. వరద ఉన్నప్పుడు ఇసుకను ఎలా తీస్తారు..? ఐదారు రోజుల్లో వరద తగ్గుతుంది.. ఇసుక సమస్య తీరుతుంది. టీడీపీ హయాంలో ఒక్క ఇసుక లారీనైనా సీజ్ చేశారా?. చంద్రబాబుకు వయసు మీరుతోంది. ప్రాజెక్టులు నిండటంతో చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు’ అని అనిల్ కుమార్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే అనిల్ వ్యాఖ్యలపై టీడీపీ, జనసేన నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే.