Ambati Rambabu:పవన్‌పై బయోపిక్ తీస్తున్నా.. టైటిల్స్ ఇవే , కెలికితే ఇంతే.. సినీ ప్రముఖులూ జాగ్రత్త : అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, ఆయన మేనల్లుడు సాయిథరమ్ తేజ్ హీరోలుగా సముద్రఖని దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘‘బ్రో’’. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇందులోని ‘‘శ్యాంబాబు’’ అనే క్యారెక్టర్ ఏపీ మంత్రి అంబటి రాంబాబును పోలినట్లుగా వుందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి అంబటి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
బ్రో ఫ్లాప్ మూవీ.. కలెక్షన్లు ఎంతంటే :
శ్యాంబాబు అని పెట్టి తీసిన సీన్‌ను దూషించి, కించపరిచే ఉద్దేశంతోనే తీశారని ఆయన ఆరోపించారు. ఆ సినిమాలో నటించిన నటీనటులు కూడా ఆ సన్నివేశంపై మాట్లాడుతున్నారని రాంబాబు ఫైర్ అయ్యారు. ఫ్లాప్ అయిన ఈ సినిమాను ఈ వివాదం ద్వారా ప్రచారం కల్పించి కలెక్షన్లు రాబట్టుకోవాలని చూస్తున్నారని అంబటి ఆరోపించారు. ఈ సినిమాకు నిన్నటి వరకు రూ.55.27 కోట్ల షేర్ కలెక్ట్ చేసిందని.. ఇవి ట్రేడ్ వర్గాల లెక్కలని మంత్రి పేర్కొన్నారు. ఒకరిని విమర్శించే ఉద్దేశంతోనే ఈ సినిమాను తీశారని.. పవన్, త్రివిక్రమ్ కూర్చొని నాపై ఈ స్క్రిప్ట్ రాశారని అంబటి దుయ్యబట్టారు. పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు రూ.50 కోట్లే పైనే పారితోషికం తీసుకున్నారని.. ఈ లెక్కన ఆయన రెమ్యూనరేషన్ కూడా వచ్చే పరిస్ధితి లేదని ఆయన దుయ్యబట్టారు.
పవన్ నాపై పగ సాధిస్తున్నారు :
పవన్ కళ్యాణ్ సినిమాలు ఇక ఆడవని ఎప్పుడో చెప్పానని.. ఎందుకంటే వారాహి అమ్మవారి పేరు పెట్టుకుని ఓ వాహనంపైకి ఎక్కి అబ్ధాలు మాట్లాడాతున్నారని రాంబాబు ఫైర్ అయ్యారు. అందుకే వారాహి అమ్మవారి శాపం పవన్ కళ్యాణ్‌కు తగిలిందన్నారు. పవన్ పూర్తి స్థాయిలో పొలిటికల్ మూవీ తీసి వుంటే తప్పు లేదని.. కానీ కమర్షియల్ సినిమాలో కావాలని శ్యాంబాబు పాత్రను సృష్టించి తనపై పగ తీర్చుకోవాలని చూశారని అంబటి రాంబాబు ఆరోపించారు. బ్రో చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌కు అమెరికాలో సాఫ్ట్‌వేర్ కంపెనీలు వున్నాయని.. చంద్రబాబు, ఆయన ముఠా సభ్యులు అమెరికాలో డబ్బులు వసూలు చేసి విశ్వప్రసాద్‌కు ఇస్తున్నారని.. దానిని ప్యాకేజీ కింద పవన్‌కు ఇస్తున్నారని మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాజకీయలా, సినిమాలా డిసైడ్ చేసుకోవాలి :
రాజకీయాలు, సినిమాలు ఇలా ఒకేసారి రెండు పడవలపై ప్రయాణం కుదరదని.. అలా చేస్తే రెండూ నాశనమవుతాయని అంబటి రాంబాబు హెచ్చరించారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒకట్రెండ్ సినిమాలు మాత్రమే చేశారని.. చిరంజీవి సైతం సినిమాలు చేయలేదని మంత్రి గుర్తుచేశారు. కానీ పవన్ మాత్రం ఒకేసారి రాజకీయాలు, సినిమాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
పవన్ బయోపిక్ టైటిల్స్ ఇవే :
పవన్ కల్యాణ్‌పై బయోపిక్ తీస్తానంటూ విలేకరులతో అన్న మంత్రి .. కథ కూడా చెప్పారు. వర్క్ మొదలైందని, కొందరు నటీనటులను కూడా సంప్రదించామని అంబటి రాంబాబు అన్నారు. ఈ సినిమాకు నిత్యపెళ్లి కొడుకు, పెళ్లిళ్లు పెటాకులు, తాళి- ఎగతాళి, మూడు ముళ్లు- ఆరు పెళ్లిళ్లు, బహుభార్యా ప్రావీణ్యుడు, MRO (మ్యారేజెస్ రిలేషన్స్ అఫెండర్), ‘అయిన పెళ్లిళ్లెన్నో పోయిన చెప్పులు ఎన్నో’ అనే టైటిల్స్ పరిశీలనలో వున్నాయన్నారు. ఆసక్తి వున్న టైటిల్‌ను సూచించినా పరిశీలిస్తామని రాంబాబు పేర్కొన్నారు. వీలైనంత త్వరగా పవన్ కల్యాణ్‌పై సినిమా తీస్తామని మంత్రి వెల్లడించారు. ఇదే సమయంలో ఎవరిని పడితే వారిని కెలికితే గుణపాఠం తప్పదని ఆయన తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులను హెచ్చరించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout