టాలీవుడ్‌లో మరో విషాదం.. మిమిక్రీ హరికిషన్ కన్నుమూత
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్‌ని వరస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇవాళ ఉదయం సీనియర్ నటి వాణిశ్రీ కుమారుడు అభినయ్ వెంకటేష్ మరణించారనే వార్త విని 24 గంటలు పూర్తి కాకమునుపే మరో విషాద వార్త వినాల్సి వచ్చింది. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ హరికిషన్ (57) తుదిశ్వాస విడిచారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం నాడు కన్నుమూశారు. హైదరాబాద్‌లోని సికింద్రాబాద్‌లో ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు. ఆయన లేరని తెలుసుకున్న అభిమానులు, ఆప్తులు, కుటుంబీకులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు. కాగా ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో గత కాలంగా బాధపడుతున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. హరికిషన్ పిల్లలు ఆస్ట్రేలియాలో ఉండటంతో వాళ్లు వచ్చేందుకు ఆలస్యం అయ్యే అవుతుంది. దీంతో ఆ డెడ్ బాడీని మార్చురీకి తరలించి భద్రపరిచారు. ఆయన మృతికి పలువురు టాలీవుడ్ నటీనటులు, ప్రముఖ రాజకీయ నేతలు, మిమిక్రీ ఆర్టిస్టులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
ఎవరీ హరికిషన్..!?
1963 మే 30న ఏలూరులో రంగమణి, వీఎల్ఎన్ చార్యులు దంపతులకు హరికిషన్ జన్మించిన ఆయన ఎనిమిదేళ్ల వయసు నుంచే మిమిక్రీ చేయడం నేర్చుకున్నారు. అలా చదువులు పూర్తి చేసుకుని 12 ఏళ్ల టీచర్‌గా పనిచేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో మిమిక్రీ లెక్చరర్‌గా పనిచేశారు. మిమిక్రీ అంటే ఆయనకు మహా ఇష్టం. అప్పట్లోనే పలువురు సినీ, రాజకీయ నాయకులు వాయిస్‌ను మిమిక్రీ చేసి హరికిషన్ పేరొందారు. అలా ఆ నోటా ఈ నోటా పడటంతో మొదట మిమిక్రీ ప్రదర్శన.. ఆ తర్వాత సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. 1971లో విజయవాడలో హరికిషన్ తొలి మిమిక్రీ ప్రదర్శన చేసి ఎంతో మంది మన్ననలు పొందారు. పలు సినిమాలు, టీవీ షోల్లో హరికిషన్ ప్రదర్శనలు ఇచ్చి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక్క మన భారతదేశంలోనే కాదు.. విదేశాల్లో కూడా 10 వేలకు పైగా మిమిక్రీ ప్రదర్శనలు ఇచ్చి శభాష్ అనిపించుకున్నారు.
ఈయన తర్వాతే ఎవరైనా..!
పాతకాలం హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్, క్రిష్ణ, శోభన్ బాబు మొదలుకొని ఆ తరువాత తరంలోని చిరంజీవి, వెంకటేష్, బాలయ్య, నాగార్జున.. నేటి తరంలోని మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, ప్రభాస్ వాయిస్‌ను మిమిక్రీ చేయడంలో నేర్పరి హరికిషన్. కేవలం వాయిస్‌లను మాత్రమే కాకుండా పశు పక్ష్యాదుల శబ్ధాలతో పాటు యంత్రాలు చేసే శబ్ధాలు తన గొంతుతో పలికించేవారు హరి కిషన్. పాటలు పాడుతూ.. సంగీత వాద్య పరికరాల సౌండ్స్‌ను తన గొంతులో పలకించడం హరి కిషన్ ప్రత్యేకత. అలా మిమిక్రీ చేయడంలో ‘నాకు నేనే సాటి.. నాకెవ్వరు లేరు పోటీ.. నా తర్వాతే ఎవరైనా’ అన్నట్లుగా ఆయన మంచి గుర్తింపు.. పేరు సంపాదించుకున్నాడు. ఇవాళ ఆయనలేని మిమిక్రీ రంగం మూగబోయింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments