‘దొరసాని’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన రెండో చిత్రం మిడిల్ క్లాస్ మెలోడీస్. టైటిల్ వింటేనే సాఫ్ట్‌గా ఉంది కదా.. నిజమే, ఓ మధ్య తరగతి కుర్రాడికి హోటల్ పెట్టాలనే చిన్న కలను ఎలా నిజం చేసుకన్నాడనే సాఫ్ట్ పాయింట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఆనంద్ మాస్ ఇమేజ్ కోసం ఏదో ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో కాకుండా తనకు నచ్చిన కథతో సినిమా చేయాలనుకున్న ఆనంద్ దేవరకొండ ప్రయత్నం ఎంత వరకు సక్సెస్ అయ్యింది. డైరెక్టర్ వినోద్ సినిమాను ఎలా తెరకెక్కించాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా కథేంటో చూద్దాం...
కథ:
గుంటూరు దగ్గరలోని ఓ పల్లెటూరులో ఉండే యువకుడు రాఘవ(ఆనంద్ దేవరకొండ)..తన అమ్మ లక్ష్మి (సురభి ప్రభావతి), తండ్రి కొండలరావు(గోపరాజు రమణ)తో కలిసి ఓ చిన్న హోటల్ నడుపుతుంటాడు. రాఘవ బొంబాయి చట్నీ చేయడంలో సిద్ధహస్తుడు. ఎలాగైనా తన బొంబాయి చట్నీని గుంటూరులో కూడా ఫేమస్ చేయాలనుకుంటాడు. అందుకు గుంటూరులో హోటల్ పెట్టాలని అనుకుంటాడు. తల్లిదండ్రులను ఒప్పించి గుంటూరుకి తీసుకొస్తాడు రాఘవ. స్కూల్ డేస్ నుండే మరదలు సంధ్య(వర్షా బొల్లమ్మ)ను ఇష్టపడతాడు. ఆమె తండ్రి హోటల్ స్థలం కోసం రాఘవ దగ్గరున్న స్థలాన్ని అమ్మించి మరీ డబ్బు కట్టించుకుంటాడు. తర్వాత పరిస్థితులు ఎలా మారుతాయి? హోటల్ బిజినెస్‌లో రాఘవ ఎలా సక్సెస్ అయ్యాడు? రాఘవ, సంధ్య ఒక్కటయ్యారా, లేదా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
సమీక్ష:
చాలా మంది యువకులు వారి తండ్రులకు మధ్య జరిగే సంఘర్షణనే మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా అనొచ్చు. సొంతంగా తనకు వచ్చిన ప్రతిభతో రాణించాలనుకునే యువకుడిగా ఆనంద్ దేవరకొండ కనపడితే, ఆయన తండ్రి పాత్రలో గోపరాజు రమణ నటించారు. ఓ చిన్న పాయింట్‌ను బేస్ చేసుకుని దర్శకుడు వినోద్ కథ రాసుకున్నాడు. కానీ మరింత గ్రిప్పింగ్ ఉండుంటే బావుండేదనిపించింది. అయితే వాస్తవానికి మరీ దూరంగా వెళ్లలేదు. ఓ గ్రామీణ నేపథ్యం.. పక్కనే ఉన్న ఓ పట్టణం చుట్టూనే కథను రన్ చేశాడు దర్శకుడు. అంతే కాకుండా దర్శకుడు పాత్రలను నేచురల్‌గా చూపించే ప్రయత్నం చేశాడు. అయితే హీరో, హీరోయిన్ మధ్య లవ్‌ట్రాక్‌ను మరింతగా బాగా తెరకెక్కించి ఉంటే బావుండేదనే ఫీలింగ్ కలుగుతుంది. మిడిల్ క్లాస్ మెలోడీస్' దాని కథను చిన్న ప్రపంచంలో వాస్తవంగా కంటే చిన్నదిగా అనిపిస్తుంది. హీరో తండ్రి పాత్రను చూస్తే సీనియర్ యాక్టర్స్ రఘుబాబు, పోసాని కృష్ణమురళి తరహా పాత్రలు గుర్తుకు వస్తాయి. ఈ పాత్ర ఇంతే అనే ఓ భావనను ముందు నుండే క్రియేట్ చేశాడు దర్శకుడు. కథను చెప్సిన తీరు ఓకే అయితే మరో లెవల్‌లో ఉండుంటే ఇంకా బావుండేదనిపించింది. కొన్ని కామెడీ సన్నివేశాలు బావున్నాయి. స్వీకర్ అగస్తి అందించిన సంగీతం, నేపథ్య సంగీతం ఓకే అనిపించాయి. సినిమాటోగ్రఫీ కూడా బావుంది. ఇక ఆనంద్ దేవరకొండ విషయానికి వస్తే యాక్టర్‌గా తొలి సినిమా కంటే ఇందులో మరింత పరిణితి కనపరిచాడు. పక్కంటి కుర్రాడి పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. ఇక వర్షా బొల్లమ్మ తన పాత్ర పరిధి మేరకు చక్కగా నటించింది. మనసులో ఏదీ దాచుకోకుండా మాట్లాడే తండ్రి పాత్రలో గోపరాజు రమణ అచ్చు పోసినట్లు సరిపోయారు. సురభి ప్రభావతి తన పాత్రకు న్యాయం చేశారు. తరుణ్ భాస్కర్ గెస్ట్ అప్పియరెన్స్ బావుంది. సినిమా మొత్తాన్ని చూస్తే చాలా మంది మధ్య తరగతి యువకుల మానసిక సంఘర్షణను దర్శకుడు ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. అయితే ఇంకా బాగా చేసుండొచ్చేమోననిపించింది.
బోటమ్ లైన్: మిడిల్ క్లాస్ మెలోడీస్.. అటెంప్ట్ ఓకే.. ఇంకా బాగా చేసుండొచ్చు
Comments