ఎంఐఎం మద్దతు ఇచ్చిందా? నేను చూడలేదు: మేయర్ విజయలక్ష్మి
- IndiaGlitz, [Thursday,February 11 2021]
జీహెచ్ఎంసీ మేయర్‌గా గద్వాల విజయలక్ష్మి ఎన్నికైన విషయం తెలిసిందే. మేయర్ ఎన్నిక అనంతరమే విజయలక్ష్మితో పాటు డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన మోతె శ్రీలక్ష్మి వెళ్లి సీఎం కేసీఆర్ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం విజయలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ..‘మా పార్టీ కార్పొరేటర్ల మద్దతుతోనే నేను మేయర్‌గా ఎన్నికయ్యా’ అని తెలిపారు. కాగా.. ఎంఐఎం మద్దతు ఇచ్చింది కదా అని విలేకరులు ప్రశ్నించగా.. ‘ఎంఐఎం నాకు మద్దతు ఇచ్చింది చూడలేదు. ఎంఐఎం మద్దతు ఇస్తే వారికి కూడా ధన్యవాదాలు’ అని తెలిపారు. మేయర్ కావడం సంతోషంగా ఉందని గద్వాల విజయలక్ష్మి తెలిపారు. జనరల్ మహిళ స్థానంలో బీసీ మహిళకు అవకాశం ఇవ్వడం కేసీఆర్ గొప్పతనమన్నారు.
గద్వాల విజయలక్ష్మి బంజారాహిల్స్ నుంచి రెండోసారి కార్పొరేటర్‌గా గెలుపొందారు. టీఆర్ఎస్ కీలక నేత కేకే వారసురాలు కావడంతో ఆమెకు రాజకీయ ఆరంగేట్రం సులభంగా లభించింది. ఎల్ఎల్బీ, జర్నలిజం చదివిన విజయలక్ష్మి అమెరికాలో 18 ఏళ్ల పాటు ఉన్నారు. 2007లో అమెరికా పౌరసత్వం వదులుకుని భారత్‌కు తిరిగొచ్చేశారు. ఎన్నిక అనంతరం మొదటిసారిగా మీడియాతో మాట్లాడిన విజయలక్ష్మి.. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఇకపై హైదరాబాదీ మహిళలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని.. తాను ఒక మహిళగా ఈ విషయాన్ని చెబుతున్నానన్నారు. అందరిని కలుపుకుని నగర అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. మహిళా సాధికారతకు ప్రయత్నిస్తానని విజయలక్ష్మి తెలిపారు.
అక్రమ సంబంధం మరోసారి బహిర్గతమైంది
కాగా.. మేయర్ ఎన్నికపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. టీఆర్ఎస్, ఎంఐఎం మధ్య ఉన్న అక్రమ సంబంధం మరోసారి బహిర్గతమైందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలో బీజేపీ చెప్పిన విషయం నిజమైందన్నారు. టీఆర్ఎస్-ఎంఐఎం రెండు పార్టీలూ చీకట్లో ప్రేమించుకుంటూ.. బయటకు వేర్వేరు అని చెప్పే ప్రయత్నం చేశాయన్నారు. రెండూ కలిసి పోటీ చేయక పోయి ఉంటే టీఆర్ఎస్కు సింగిల్ డిజిట్ కూడా వచ్చేది కాదని బండి సంజయ్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ పక్కా మత తత్వ పార్టీ అయిన ఎంఐఎం చెంచా అని ఈ రోజు ఋజువైందన్నారు. జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎమ్ చేతిలో ఉండటం ఖాయమన్నారు. సిగ్గు లేక ఎన్నికల్లో మేము వేర్వేరు అని చెప్పుకుని ప్రచారం చేసుకున్నారు.