7 నుంచి మెట్రో ప్రారంభం.. ట్రైన్ ఎక్కాలంటే ఈ నిబంధనలు పాటించాల్సిందే..

  • IndiaGlitz, [Thursday,September 03 2020]

సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణలో మెట్రో రైలు సర్వీస్ ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటిని తాజాగా కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి విడుదల చేశారు. ఈ మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ ఫాలో అయితేనే మెట్రో ట్రైన్‌లోకి ఎంట్రీ ఉంటుంది. ట్రైన్‌లోకి ఎక్కిన అనంతరం కూడా భౌతిక దూరం వంటి నిబంధనలు తప్పనిసరి. మెట్రోస్టేషన్ల ఎంట్రీ పాయింట్ల వద్ద శానిటైజర్‌ డిస్పెన్సర్లు ఏర్పాటు చేయాలి.

ప్రయాణికులకు థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేశాకే స్టేషన్లలోకి అనుమతిస్తారు. టికెట్ల కోసం టోకెన్ల జారీ ఉండదు. ప్రయాణికులు తప్పనిసరిగా స్మార్ట్‌ కార్డులు, డిజిటల్‌ పద్ధతులు అనుసరించాలి. మెట్రో కార్డుల రీచార్జి సైతం డిజిటల్‌ మాధ్యమంలోనే చేసుకోవాల్సి ఉంటుంది. మెట్రో స్టేషన్లలో కౌంటర్లు తెరిచే ఉంటాయి. స్మార్ట్‌ కార్డ్డులు, మెట్రో కార్డులను కౌంటర్లలో కొనుగోలు చేసేందుకు వీలు కల్పిస్తారు. మాస్క్‌ ధరించడం తప్పని సరి. భౌతిక దూరం నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పక పాటించాల్సిందే.

సిట్టింగ్‌కు, సిట్టింగ్‌కు మధ్య మీటర్‌ దూరం తప్పని సరి. మెట్రోలోని ఎయిర్‌ కండిషనర్లను సైతం క్రమం తప్పకుండా నియంత్రిస్తారు. మెట్రోస్టేషన్లు ప్లాట్‌ఫామ్‌లు, మెట్రో కోచ్‌ల్లో రద్దీ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. మెట్రో సిబ్బంది, పోలీసులు పౌర రక్షణ వలంటీర్లను రద్దీ నియంత్రణకు వినియోగిస్తారు. కట్టడి ప్రాంతాల్లో మెట్రో సేవలు అందుబాటులో ఉండవు. ఈ క్రమంలోనే అధికారులు పలు మెట్రో స్టేషన్లను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.