Metro Expansion: తక్కువ ఖర్చుతో మెట్రో విస్తరణ చేపడతాం: సీఎం రేవంత్

  • IndiaGlitz, [Monday,January 01 2024]

న్యూ ఇయర్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై క్లారిటీ ఇచ్చారు. మెట్రో రైలు విస్తరణ, ఫార్మా సిటీ ప్రాజెక్టులను రద్దు చేయడం లేదని స్పష్టం చేశారు. అయితే ఎయిర్‌పోర్టుకు మెట్రోను విస్తరించే దూరాన్ని మాత్రం తగ్గించే ప్రక్రియ చేపడతామని తెలిపారు. బీహెచ్ఈఎల్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 32 కిలోమీటర్లు మెట్రో విస్తరణ ఉంటుందన్నారు. నాగోల్ నుంచి ఎల్బీ నగర్, చాంద్రాయణగుట్ట వద్ద ఎయిర్ పోర్టుకు వెళ్లే మెట్రో లైనుకు అనుసంధానిస్తామని వివరించారు.

అవసరమైతే మియాపూర్ నుంచి రామచంద్రపురం, మైండ్ స్పేస్ వరకు ఉన్న మెట్రో లైన్‌ను ఫైనాన్సిల్ డిస్ట్రిక్ట్ వరకు విస్తరిస్తామని చెప్పుకొచ్చారు. గచ్చిబౌలి ఏరియా నుంచి ఎయిర్‌పోర్టుకు మెట్రోలో వెళ్లే వారు దాదాపుగా ఉండరని వ్యాఖ్యానించారు. తాము కొత్తగా ప్రతిపాదించనున్న మెట్రో కారిడార్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఖర్చుతో పోలిస్తే చాలా తక్కువ ఖర్చుతోనే పూర్తవుతాయని రేవంత్ క్లారిటీ ఇచ్చారు.

ఇక ఫార్మా సిటీ, ఔటర్ రింగ్ రోడ్, రీజినల్‌ రింగ్ రోడ్ మధ్య జీరో పొల్యుషన్‌తో ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ ప్రత్యేక క్లస్టర్ల దగ్గర పరిశ్రమల్లో పనిచేసే వారికి ఇళ్ల నిర్మాణం చేపడతామన్నారు. అలాగే యువతకు అవసరమైన స్కిల్స్ పెంపొందించడానికి ప్రత్యేక యూనివర్సిటీలు కూడా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు కలిగిన సంస్థలు, ప్రముఖ పారిశ్రామికవేత్తల ద్వారా ట్రైనింగ్ ఇప్పిస్తామన్నారు. తన వద్ద చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి ఉండదని.. చేసేదే చెబుతానని వెల్లడించారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ నియామకం తర్వాతే జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తామని వివరించారు.