Download App

Mental Madhilo Review

'పెళ్ళిచూపులు' చిత్రంతో నిర్మాత‌గా మంచి పేరు సంపాదించుకున్నాడు రాజ్‌కందుకూరి. షార్ట్ ఫిలిం డైరెక్ట‌ర్ అయిన త‌రుణ్ భాస్క‌ర్‌ను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేసిన రాజ్ కందుకూరి ఆ సినిమాతో పెద్ద స‌క్సెస్ అందుకున్నారు. చిన్న చిత్రంగా విడుద‌లైన `పెళ్ళి చూపులు` తిరుగులేని విజ‌యాన్ని సొంతం చేసుకుంది. వెంట‌నే రాజ్ కందుకూరి స్టార్ హీరోతో కాకుండా మ‌రోసారి కొత్త ద‌ర్శ‌కుడు, కొత్త టీంతో మ‌రో ప్రేమ క‌థ‌ను రూపొందించాడు. ఆ చిత్ర‌మే `మెంట‌ల్ మ‌దిలో`. మ‌న‌సుకు న‌చ్చిన‌ట్టు చేయాల‌నే థీమ్‌ను పెళ్ళిచూపులు చిత్రంలో చూపించారు. మ‌రిప్పుడు మెంట‌ల్ మ‌దిలో ఏం చెప్పారో తెలియాంటే క‌థ‌లోకి వెళ‌దాం.

క‌థ:

చిన్న‌ప్ప‌ట్నుంచి ఏదైనా నిర్ణ‌యం తీసుకోవాలంటే క‌న్‌ఫ్యూజ‌న్‌కు గుర‌య్యే కుర్రాడు అర‌వింద్ కృష్ణ‌(శ్రీవిష్ణు). త‌న‌కి ఉన్న ఇబ్బందుల‌ను దాటి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించుకుంటాడు. కానీ త‌ను క‌న్‌ఫ్యూజ్ అయ్యే త‌త్వం నుండి మాత్రం బ‌య‌ట‌ప‌డ‌డు. దాంతో అమ్మాయిలెవ‌రూ త‌న‌ను ఇష్ట‌ప‌డ‌రు. కానీ స్వేచ్ఛ‌(నివేదా పేతురాజ్‌) కృష్ణ‌ను ఇష్ట‌ప‌డుతుంది. పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కాబ‌ట్టి అర‌వింద్ కృష్ణ కూడా స్వేచ్ఛ‌తో ధైర్యంగానే మాట్లాడుతాడు. నిశ్చితార్థానికి ముందే ఇద్ద‌రికీ మంచి ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. అరవింద్‌ లోపాల‌ను స‌రిదిద్దుకోవ‌డానికి స్వేచ్ఛ సాయం కోర‌తాడు. తీరా నిశ్చితార్థం ఓ కార‌ణంతో వాయిదాప‌డుతుంది. అయినా వీరిద్ద‌రు ఒక‌రినొక‌రు ఇష్ట‌ప‌డుతూనే ఉంటారు. అలాంటి స‌మ‌యంలో అర‌వింద్‌కి ముంబై లో నెల రోజులు ఉద్యోగం చేయాల్సి వ‌స్తుంది. అర‌వింద్‌కి ముంబై ప్ర‌యాణంలో అత‌నికి రేణు (అమృత‌) ప‌రిచ‌య‌మ‌వుతుంది. అప్ప‌టిదాకా త‌న‌కు ఎలాంటి అమ్మాయి కావాల‌ని మ‌న‌సులో అనుకున్నాడో ఆ పోలిక‌ల‌న్నీ రేణులో క‌నిపిస్తాయి. ఆమెను ఇష్ట‌ప‌డ‌టం మొద‌లుపెడ‌తాడు. రేణుకి కూడా అర‌వింద్ అంటే ఇష్ట‌మే. అయితే అనుకోకుండా అర‌వింద్ ఓ చిన్న త‌ప్పు చేస్తాడు. ఆ త‌ప్పేంటి?  దాని వ‌ల్ల అర‌వింద్ ఎలాంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొన్నాడు?  చివ‌రికు అర‌వింద్ కృష్ణ ఎవ‌రిని చేసుకున్నాడు? అనే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ప్ల‌స్ పాయింట్స్:

- న‌టీన‌టులు
- సంగీతం
- సినిమాటోగ్ర‌ఫీ

మైన‌స్ పాయింట్స్:

- సినిమాలో సెకండాఫ్ స్టార్టింగ్ టేకాఫ్
- మాస్ ఆడియెన్స్‌కు సినిమా న‌చ్చుతుంద‌ని క‌చ్చితంగా చెప్ప‌లేం

విశ్లేష‌ణ:

ఓ ఫీల్‌ను సినిమా ఆసాంతం క్యారీ చేయించ‌డంలో ద‌ర్శ‌కుడు వివేక్ ఆత్రేయ స‌క్సెస్ అయ్యాడు. దానికి తోడు అత‌నేం చెప్పాల‌నుకున్నాడో దాన్ని తెర‌పై చూపించ‌గ‌లిగే న‌టీనటులు దొరికారు. ఇప్ప‌టి వ‌ర‌కు స‌రైన పాత్ర‌లు, హిట్స్ లేని శ్రీవిష్ణుకి ఈ సినిమా మంచి గుర్తింపు తెచ్చిపెడుతుంద‌న‌డంలో సందేహం లేదు. ఎందుకంటే త‌ను నిజ జీవితంలో ఎలా ఉంటారో తెర‌మీద కూడా దాదాపు అలాగే క‌నిపించారు. నివేదా పేతురాజ్ తెలుగులో తొలి సినిమాతోనే న‌ట‌న ప‌రంగా ఆక‌ట్టుకుంది. ఆమె ఇందులో ఎక్క‌డా న‌టించిన‌ట్టు క‌నిపించ‌దు.. మామూలు మిడిల్ క్లాస్ అమ్మాయిలాగానే ఉంటుంది. ఆమె తీరు, ప్ర‌వ‌ర్త‌న‌, చేసుకోబోయే వ్య‌క్తి మీద ఆమెకున్న అనురాగం.. ప్ర‌తి విష‌యంలోనూ చాలా స‌హ‌జ‌త్వాన్ని క‌న‌బ‌రిచింది.  ఓ మెచ్యూర్డ్ మెంటాలిటీ ఉన్న అమ్మాయి రేణు పాత్ర‌లో అమృత మెప్పించింది. `మ‌నిద్ద‌రి మ‌ధ్య అనుబంధం చాలా డిఫ‌రెంట్‌. నువ్వు థాంక్స్ చెబితే నేనూ థాంక్స్ చెప్పాలి. నువ్వు సారీ చెబితే నేనూ సారీ చెప్పాలి. ప్లీజ్ వ‌ద్దు` అని రేణు చెప్పే డైలాగు.. ఎవ‌రినైనా ఇట్టే ఆక‌ట్టుకుంటుంది. ఒక జంట మ‌ధ్య జ‌రిగే త‌ప్పొప్పుల‌కు ఇద్ద‌రూ బాధ్యులే అనే విష‌యాన్ని ద‌ర్శ‌కుడు చాలా హుందాగా, వివ‌రంగా చెప్పించిన‌ట్టు అనింపించింది.  ఇలా హార్ట్ ట‌చింగ్‌ స‌న్నివేశాలు మెప్పిస్తాయి. పాత్ర‌ల‌న్నీ మ‌న క‌ళ్ల ముందు తిరుగుతున్న‌ట్టే ఉంటాయి. సినిమా సాదాసీదాగా జ‌రుగుతున్న‌ట్టు ఉంటుంది.  అందువ‌ల్లే స‌గ‌టు ప్రేక్ష‌కుడు క‌థ‌కు చాలా బాగా క‌నెక్ట్ అవుతాడు. పైగా త‌ల్లీకొడుకుల అనుబంధం, త‌ల్లీ కూతుళ్ల అనుబంధం, తండ్రీ కొడుక్కి, తండ్రీ కూతురుకి మ‌ధ్య ఉన్న బంధం, మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాల్లోని వ్య‌క్తుల మ‌న‌స్త‌త్వాలు చ‌క్క‌గా చూపించాడు ద‌ర్శ‌కుడు.  ఒక‌వైపు ఎదుటివాళ్లు మ‌ర్యాద ఇవ్వ‌లేద‌ని గొణుక్కుంటూనే, మ‌రోవైపు మొహ‌మాటం కోసం అబ‌ద్ధాలు ప‌లికే మిడిల్ క్లాస్ మ‌నుషుల‌ను,  ఇప్పుడిప్పుడే మ‌ధ్య త‌ర‌గ‌తి ఇళ్ల‌ల్లోని ఆడ‌పిల్ల‌ల్లో వ‌స్తున్న మార్పులను హృద్యంగా తెర‌కెక్కించాడు.  జీవితాన్ని పోగొట్టుకుని త‌న‌కు తానే ధైర్యం చెప్పుకోవాల‌నుకుంటున్న ఓ అమ్మాయి, చిన్న‌ప్పుడు తెలిసీ తెలియ‌ని వ‌య‌సులో చేసిన త‌ప్పు ప్ర‌భావం ఓ కుర్రాడి మ‌న‌సుపై ఎలాంటి ప్ర‌భావం చూపింది .. వంటి అంశాల‌ను చాలా చ‌క్క‌గా డీల్ చేశారు. అదే స‌మ‌యంలో తెర‌మీద క్వాలిటీ ఎక్క‌డా త‌గ్గ‌లేదు. ప్ర‌తి విభాగమూ తమ త‌మ ప‌నుల‌ను బాధ్య‌తాయుతంగా నిర్వ‌ర్తించింద‌నే చెప్పాలి.   మ‌న‌స్సుకు సంబంధించి చాలా కీల‌క‌మైన అంశాల‌నే డీల్ చేశారు ద‌ర్శ‌కుడు.

బోట‌మ్ లైన్: క‌న్‌ఫ్యూజ‌న్ లేని 'మెంట‌ల్ మ‌దిలో'

Rating : 3.0 / 5.0