అంతటి ధైర్యవంతుల మధ్య గడపడం నా అదృష్టం : మెహరీన్ కౌర్ పిర్జాదా

  • IndiaGlitz, [Friday,November 04 2016]

నటించింది ఒక్క సినిమానే అయినప్పటికీ.. అందరి మనసులో చెరగని సంతకం చేసింది మేహరీన్. నాని కథానాయకుడిగా నటించిన "కృష్ణగాడి వీరప్రేమగాధ"తో కథానాయకిగా తెలుగు తెరకు పరిచయమైన పంజాబీ సుందరి మెహరీన్ పుట్టినరోజు రేపు (నవంబర్ 5). ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అపోలో హాస్పిటల్ లో క్యాన్సర్ కారణంగా బాధపడుతున్న చిన్నారులను కలిసింది మెహరీన్. వారందరితో కొంతసేపు సరదాగా గడపడంతోపాటు, వారితో ప్రేమగా ముచ్చటించి వారిలో నూతనోత్తేజాన్ని నింపింది.
ఈ సందర్భంగా మెహరీన్ మాట్లాడుతూ.. "మానసికంగా, శారీరకంగా భరించలేనంత బాధను గుండెల్లో అణిచిపెట్టుకొని తమ చిరునవ్వులతో ఎదుటివారికి స్పూర్తిగా నిలవగల ఈ చిన్నారులతో ఈ విధంగా గడపడం, వారితో క్వాలిటీ టైం స్పెండ్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. వారిని చూస్తే ధైర్యం అంటే ఏమిటో అర్ధమయ్యింది. ఇక నుంచి ప్రతి సంవత్సరం నా పుట్టినరోజు వేడుకలను ఇదే విధంగా సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించుకొన్నాను" అన్నారు.
మేహరీన్ కథానాయికగా నటించిన హిందీ చిత్రం "ఫిల్లౌరీ" అతి త్వరలో విడుదలకు సిద్ధమవుతుండగా.. రెండు తెలుగు సినిమాలు ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్నాయి!