పూరి జగన్నాథ్... మాస్ హీరోయిజాన్ని అద్భుతంగా తెరకెక్కించే డైరెక్టర్స్‌లో ఒకరు. అయితే ఈయనకు గత కొంతకాలంగా ఆశించిన స్థాయి విజయం దక్కలేదు. సక్సెస్ రాకపోవడమో, లేదా తను చేసింది తనకే రొటీన్‌గా అనిపించిందేమో కానీ పూర్తి తన స్టయిల్ మార్చి తెరకెక్కించిన పూర్తి స్థాయి ప్రేమ కథా చిత్రం `మెహబూబా`. ఈ చిత్రంతో ఇప్పటి వరకు బాలనటుడిగా సినిమాలు చేస్తూ వచ్చిన పూరి తనయుడు ఆకాశ్ పూరి హీరోగా పరిచయం కావడం విశేషం. సినిమా టీజర్‌లో 1971 వార్ బ్యాక్‌డ్రాప్.. యుద్ధ సన్నివేశాలు దానికి సంబంధించి ఓ ఇండియన్ సైనికుడు.. పాకిస్థాన్ అమ్మాయి మధ్య ప్రేమకథే `మెహబూబా` అని తెలియడంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ మెహబూబాతో పూరి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడా? లేదా ? అని తెలియాలంటే సినిమా కథేంటో చూద్దాం...
కథ:
హైదరాబాద్‌కి చెందిన రోషన్(ఆకాశ్ పురి) ఆర్మీలో చేరి దేశానికి ఏదైనా చేయాలనుకునే యువకుడు. అతన్ని ఏవో గత జన్మ జ్ఞాపకాలు వెంటాడుతుంటాడు. పాకిస్థాన్‌లో అఫ్రిన్(నేహాశెట్టి) కూడా బాగా చదువుకోవాలనుకుంటుంది. ఏడాది పాటు హైదరాబాద్ వెళ్లి చదువుకోవాలని అనుకుంటుంది. ఈమెను కూడా ఏవో గత జన్మ జ్ఞాపకాలు వెంటాడుతుంటాయి. నదిర్(విష్ణురెడ్డి)ని పెళ్లి చేసుకుంటానని ఒప్పుకోవడంతో అఫ్రిన్ తండ్రి(మురళీశర్మ) ఆమెను పాకిస్థాన్ పంపుతాడు. ఆయనకు తన కూతురంటే ప్రాణం. ఆమెకు వ్యతిరేకంగా ఏ పనీ చేయడు. అయితే నదిర్ అనుమానపడటంతో అఫ్రిన్ తల్లిదండ్రులు ఆమెను పాకిస్థాన్ రమ్మంటారు. లాహోర్ బయలుదేరిన అఫ్రిన్‌కి .. హిమాయాలకు ట్రెక్కింగ్ కో్సం వెళుతున్న రోషన్ పరిచయం అవుతాడు. ఇద్దరి మధ్య ఏదో అనుబంధం ఉందని ఇద్దరికీ అర్థమవుతుంది కానీ అదేంటో తెలియదు. అదే సమయంలో ట్రెక్కింగ్‌లో రోషన్‌కు అఫ్రిన్‌ను పోలిన అమ్మాయి మందిర శవం దొరుకుతుంది. హిమాయాల్లోని మంచు కారణంగా ఆమె శరీరానికి ఏదీ కాదు. ఈలోపు మీడియా కారణంగా మందిరా శవం గురించి అందరికీ తెలుస్తుంది. అదే సమయంలో మందిరా వద్ద బ్యాగ్‌లో రోషన్ పొటో దొరుకుతుంది. అసలు రోషన్ ఫొటో మందిర వద్దరకు ఎలా వచ్చింది? ఇద్దరి మధ్య అనుబంధం ఏంటి? కబీర్, మందిర మధ్య ఉండే అనుబంధం ఎలాంటిది? చివరకు రోషన్, అఫ్రిన్ కలుసుకుంటారా? లేదా? అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
ఆకాశ్ పూరి నటన. చిన్నప్పట్నుంచి సినిమాలపై ఉన్న ఆసక్తి.. నటనలో తీసుకున్న శిక్షణ.. సినిమాల్లో నటించిన అనుభవం కారణంగా ఆకాశ్ తన పాత్రను సునాయసంగా నటించేశాడు. ఇందులో లుక్ పరంగా, డైలాగ్ డెలివరీ పరంగా ఆకాశ్ ఆకట్టుకున్నాడు. రెండు పాత్రల్లో చక్కటి వేరియేషన్ బావుంది. విష్ణుశర్మ సినిమాటోగ్రఫీ బావుంది. ఉత్తరాఖండ్‌లోని సన్నివేశాలు, ఫైట్స్ ల్లో విష్ణుశర్మ మంచి విజువల్స్ ఆకట్టుకుంటాయి. సందీప్ చౌతా బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది. కొన్ని దేశభక్తి సన్నివేశాలు, కొన్ని సందర్భాల్లో సంభాషణలు బావున్నాయి.
మైనస్ పాయింట్స్:
మంచి పెర్ఫామెన్స్ స్కోప్ ఉన్న పాత్రలో నేహాశెట్టి నటన ఆకట్టుకోలేకపోయింది. పూరి జగన్నాథ్ పూర్వజన్మలనేపథ్యం.. దానికి ఇండో పాక్ యుద్ధం.. వార్ సన్నివేశాలు ఇవన్నీ తీసుకున్నా కథను ఆసక్తికరంగా మలచలేకపోయాడు. సినిమా ఆసాంతం రెండు లవ్ స్టోరీస్ నడుస్తున్నా లవ్‌లోని ఎమోషన్స్ ఎక్కడా ప్రేక్షకుడికి కనెక్ట్ కాదు. పాటలు బాలేవు. పాత్రలు చిత్రీకరణ, వాటి చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పించావు. స్లో నెరేషన్, స్క్రీన్‌ప్లే గ్రిప్పింగ్‌గా, ఆసక్తికరంగా లేకపోవడం.
విశ్లేషణ:
పూరి సినిమా అంటే మాస్ హీరోయిజమ్.. చక చక సాగేపోయే స్క్రీన్‌ప్లే కనపడుతుంది. కానీ మెహబూబాలో ఈ రెండు కనపడవు. సరే పూరి లవ్ స్టోరీని కొత్తగా ట్రై చేశాడు కదా! అనుకుందామనుకుంటే.. ఆ లవ్‌స్టోరీలో ఫీల్ కనపడదు. కథలో మెప్పించే సన్నివేశాలు అడపాదడపా తప్ప.. ఎక్కడా కనపడవు. ప్రేమ కథ అంటే సన్నివేశాల్లోఎమోషన్స్ బలంగా ప్రేక్షకుడి మదిని తాకాలి. అలాంటి సన్నివేశాలు సినిమాలో కనపడవు. చాలా మంది హీరోలను మాస్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టిన పూరి .. తన కుమారుడి డెబ్యూ మూవీని కొత్తగా ట్రై చేసి ఫెయిలయ్యాడు. క్లైమాక్స్ ఫైట్ ఏంటో సాధారణప్రేక్షకుడికి అర్థం కాదు. ఇండియా, పాకిస్థాన్ గొడవను ఆటలా చేసేశాడేంటి పూరి అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో కనపడే లేడీ మిలటరీ అధికారులేంటో తెలియదు. సినిమా స్లో నెరేషన్‌లో ఉండటం వల్ల అసలు ఆసక్తికరంగా లేని సినిమా ప్రేక్షకుడి సహనానికి పరీక్షలా కనపడుతుంది.
బోటమ్ లైన్: మెహబూబా... సహనానికి పరీక్ష
Comments