మీ ప్రయాణం స్ఫూర్తిదాయకం: సోనూపై మెగాస్టార్ ప్రశంసలు

కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్ విధించిన సమయంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ బయటకు వచ్చేందుకు ఎవరూ సాహసించలేదు. అత్యవసర సేవల సిబ్బంది మినహా అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అలాంటి సమయంలో నటుడు సోనూసూద్ బయటకు వచ్చి వలస కార్మికులకు సేవలందించారు. దీంతో వారి పాలిట దేవుడిలా మారిపోయారు. కష్టమని ఎవరూ మెసేజ్ పెట్టినా.. వెంటనే స్పందిస్తూ వారి కష్టాలను తీర్చడంలో సోనూసూద్ ముందుంటారనడంలో సందేహం లేదు. అలాంటి సోనూసూద్ బయోపిక్‌ ‘ఐయామ్ నో మెస్సయ్య’ అనే టైటిల్‌తో పుస్తక రూపం దాల్చింది. ఈ విషయాన్ని ఇటీవల సోనూసూద్ ప్రకటించారు.

ఈ బుక్‌ను మెగాస్టార్‌ చిరంజీవికి 'ఆచార్య' షూటింగ్‌ సెట్స్‌లో సోనూసూద్ అందించారు. ఈ బుక్‌ అందుకున్న మెగాస్టార్ ట్విట్టర్ ద్వారా‌ స్పందిస్తారు. పుట్టుకతో ఎవరూ హీరోలు కారని.. తాము నడుచుకునే విధానంతోనే హీరోలుగా మారతారని చిరు పేర్కొన్నారు. ''సోనూసూద్‌ మీ 'ఐ యామ్‌ నో మెసయ్య' బుక్‌ విడుదల సందర్భంగా ఇవే నా శుభాకాంక్షలు. పుట్టుకతో ఎవరూ హీరోలు కారని, ఆ తర్వాత నడిచే విధానంతోనే హీరోలుగా మారతారని మరోసారి మీరు నిరూపించారు. ఈ కష్టకాలంలో వేలాదిమందిని మీరు ఆదుకున్నారు. మీ ప్రయాణం అందరికీ స్ఫూర్తిదాయకం.. అని తెలియజేస్తూ.. సోనూసూద్‌ నుంచి బుక్‌ అందుకుంటోన్న పిక్‌ని పోస్ట్ చేశారు.

చిరు ట్వీట్‌ చూసి సోనూసూద్ పొంగిపోయారు. ఇది తనకు చాలా గొప్ప గౌరవంగా ఫీలయ్యారు. చిరు ఫీడ్ బ్యాక్ కోసం ఎదురు చూస్తూ ఉంటానని రిప్లైలో సోనూ వెల్లడించారు. ''అత్యంత ప్రియమైన మనిషి నుంచి.. ఇంత గొప్ప ప్రేమను పొందడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. మాటలు రావడం లేదు.. ధన్యవాదాలు సర్‌. ఎప్పుడూ నేను చెప్పేది ఒక్కటే సర్‌ 'యు ఆర్‌ ద బెస్ట్'. మీరు ఈ బుక్‌ చదివిన తర్వాత ఇచ్చే ఫీడ్‌బ్యాక్‌ కోసం ఎదురు చూస్తుంటాను. లవ్‌ యు సార్‌..'' అని పేర్కొన్నారు.