20లోకి మెగాస్టార్ 'చూడాలని ఉంది'
- IndiaGlitz, [Sunday,August 27 2017]
'హిట్లర్'తో సెకండ్ ఇన్నింగ్స్‌కి శ్రీకారం చుట్టిన మెగాస్టార్ చిరంజీవి.. మరో రెండు సినిమాల తరువాత ఇండస్ట్రీ హిట్ ఇచ్చి అప్పట్లో సంచలనం సృష్టించాడు. అలా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ఆ చిత్రమే 'చూడాలని ఉంది'. కలకత్తా నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో చిరు లుక్స్, కాస్ట్యూమ్స్, స్టైల్, స్టెప్స్, కామెడీ టైమింగ్.. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ హైలెట్ అయింది.
చిన్నపిల్లలతోనే 'రామాయణం' తీసి టాలీవుడ్ దృష్టిని తన వైపు తిప్పుకున్న గుణశేఖర్.. తన తదుపరి చిత్రమైన 'చూడాలని ఉంది' ని చాలా అందంగా తీర్చిదిద్దాడు. ఆర్టిస్ట్‌ల విషయంలోనూ, టెక్నీషియన్ల విషయంలోనూ గుణ మంచి అవుట్‌పుట్‌ని రాబట్టుకున్నాడు. 'జగదేక వీరుడు అతిలోక సుందరి' తరువాత చిరుతో ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అంటే.. తడుముకోకుండా చెప్పేది ఒకటే. అదే మణిశర్మ సంగీతం.
ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం. కలకత్తా గొప్పతనం చాటి చెప్పే 'యమహా నగరి' తీసుకున్నా.. యువతకి స్ఫూర్తినిచ్చే పాట 'ఓమారియా.. ఓ మారియా.. 'తీసుకున్నా.. పిల్లలకు నచ్చేలా రూపొందించిన 'సింబలే సింబలే' తీసుకున్నా.. ఒక్కో పాట ఒక్కో ఎక్స్‌పీరియన్స్. అలాగే 'రామ్మా చిలకమ్మా' పాట అయితే అప్పట్లో ఓ సంచలనం. 'అబబ్బా ఇద్దు', 'మనస్సా ఎక్కడున్నావ్' అయితే మెలోడీతో సాగే సూపర్బ్ డ్యూయెట్స్. కేవలం పాటలే కాదు.. మణి నేపథ్య సంగీతం కూడా సినిమాని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లిందనడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా చిరు, అంజలా ఝవేరి మధ్య సాగే 'రైల్వేస్టేషన్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్' సీన్ లో మణి ఆర్.ఆర్. ఎక్స్‌ట్రార్డనరీగా ఉంటుంది.ఈ చిత్రంతో మణి నంది, ఫిల్మ్‌ఫేర్ అవార్డులను సొంతం చేసుకున్నాడు.
ఛోటా కె.నాయుడు కెమెరా వర్క్ ఈ సినిమాకి మరో ఆకర్షణ. 1998లో ఆగస్టు 27న విడుదలైన 'చూడాలని ఉంది'.. నేటితో 19 ఏళ్లు పూర్తిచేసుకుని 20వ వసంతంలోకి అడుగుపెడుతోంది.