మీ భరోసాతో ఉత్సాహంగా ముందుకెళ్తాం: జగన్కు థ్యాంక్స్ చెబుతూ చిరంజీవి ట్వీట్
- IndiaGlitz, [Friday,February 11 2022]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. గురువారం ఉదయం ఆయన నేతృత్వంలో సినీ ప్రముఖుల బృందం భేటీ అయ్యింది. చిరంజీవి వెంట మహేశ్ బాబు, ప్రభాస్, కొరటాల శివ, రాజమౌళి, ఆర్ నారాయణ మూర్తి తదితరులు వున్నారు. అనంతరం మెగాస్టార్ చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ నిర్ణయం తమను ఎంతో సంతోష పరిచిందన్నారు. టికెట్ ధరలకు సంబంధించి శుభం కార్డు పడినట్లే తాము భావిస్తున్నామని చిరంజీవి ఆకాంక్షించారు. చిన్న సినిమాలు ఐదో షోకు అనుమతించడం శుభపరిణామమన్నారు.
సమస్యల పరిష్కారానికి సంబంధించి ఈనెలాఖరులోనే జీవో వస్తుందని భావిస్తున్నామని చిరంజీవి తెలిపారు. మంత్రి పేర్ని నాని చొరవతో ఈ సమస్యలకు శుభంకార్డు పడిందని మెగాస్టార్ చెప్పారు. హైదరాబాద్ తరహాలో విశాఖలోనూ సినీ పరిశ్రమను అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు జగన్ చెప్పారని చిరు తెలిపారు. దానికి తమ వంతు సహకారం ఉంటుందని మెగాస్టార్ అన్నారు. తర్వాత సినీ ప్రముఖులతో కలిసి హైదరాబాద్కు తిరిగి వెళ్లిపోయారు. అనంతరం జగన్కు ధన్యవాదాలు చెబుతూ చిరంజీవి ట్వీట్ చేశారు.
‘‘ తెలుగు సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలన్నీ అన్ని కోణాల్లో అర్థం చేసుకుని, పూర్తి అవగాహనతో, ఎంతో సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిపి, సమస్యలపై ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకోవడమే కాక, తెలుగు చిత్ర పరిశ్రమకు భవిష్యత్ కార్యక్రమాన్ని సూచిస్తూ, పరిశ్రమకి అన్ని రకాలుగా అండగా వుంటానని భరోసా ఇస్తూ ఎంతో సానుకూలంగా స్పందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారికి పరిశ్రమలోని ప్రతి ఒక్కరి తరపున మరో మారు కృతజ్ఞతలు.
త్వరలోనే అధికారికంగా పరిశ్రమ కి శుభవార్త అందుతుందని ఆశిస్తున్నాను. మీరు ఇచ్చిన భరోసాతో,మీరు చేసిన దిశానిర్దేశం తో తెలుగు పరిశ్రమ రెట్టింపు ఉత్సాహం తో ముందుకెళుతుందన్న నమ్మకంతో హృదయ పూర్వక ఆనందాన్ని తెలియచేస్తూ థాంక్ యూ వైఎస్ జగన్ గారు’’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.
#ThankyouSriYSJagan @ysjagan @AndhraPradeshCM pic.twitter.com/jYoT4cKN9H
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 10, 2022