రాజకీయాల వల్లే సినిమా విలువ తెలిసింది...అవినీతి లేనిది చిత్ర పరిశ్రమలోనే : చిరంజీవి వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
గోవాలో జరిగిన 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ముగింపు వేడుకలో మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చేతుల మీదుగా ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్’’ అవార్డ్ అందుకున్నారు. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ.. గతంలో నిర్వహించిన చలన చిత్రోత్సవంలో ఒక్క దక్షిణాది నటుడి ఫోటో లేకపోవడంపై ఎంతో బాధపడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు తానే అవార్డును అందుకోవడం ఆనందంగా వుందని చిరంజీవి అన్నారు.
ఇప్పుడు ఇండియన్ సినిమానే:
తన జీవితంలో ఈ క్షణం కోసం దశాబ్ధాల నుంచి ఎదురుచూస్తున్నానని మెగాస్టార్ పేర్కొన్నారు. సరైన సమయంలోనే ఈ అవార్డ్ ఇచ్చారని.. ఇది తనతో పాటు అభిమానులకు ఉత్సాహాన్ని కలిగించిందన్నారు. 45 ఏళ్లుగా పైగా ఇండస్ట్రీలో ఉన్నానని.. మధ్యలో రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల కొంత గ్యాప్ వచ్చిందని చిరు తెలిపారు. అయితే రాజకీయాల్లోకి వెళ్లడం వల్లే సినిమా విలువేంటో అర్ధమైందని... ఏ రంగంలోనైనా అవినీతి వుంటుందేమో కానీ, చిత్ర పరిశ్రమలో లేదని మెగాస్టార్ పేర్కొన్నారు. సినిమా ఎక్కడైనా తీయొచ్చని, అది భారతీయ సినిమా అని గుర్తుపెట్టుకోవాలని చిరు అన్నారు. ఇప్పుడు ప్రాంతీయ భేదాలు పోయి ఇండియన్ సినిమా అనే రోజు వచ్చిందని మెగాస్టార్ పేర్కొన్నారు.
యువ హీరోలకే నేను పోటీ :
సెకండ్ ఇన్నింగ్స్‌లో ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారోనని భయపడేవాడినని.. ప్రస్తుతం తనకు యువ హీరోలు పోటీ కాదని, తానే వాళ్లకు పోటీ అన్న ఆయన వాళ్లకు ఇప్పుడు కష్టకాలమేనని వ్యాఖ్యానించారు. ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన శివశంకర ప్రసాద్ అనే తనకు చిత్ర పరిశ్రమ చిరంజీవిగా మరో జన్మ ఇచ్చిందని.... తాను ఈ స్థాయికి రావడానికి ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగు అభిమానులేనని మెగాస్టార్ అన్నారు. వారు ఎక్కడున్నా తాను వారి ప్రేమకు దాసోహమని... ఆ ప్రేమే తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని, మీ అందరికీ జీవితాంతం కృతజ్ఞతగా వుంటానని చిరంజీవి పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments