Chiranjeevi:మెగా బ్రదర్స్‌పై రోజా కామెంట్స్..మంత్రిగా మా ఇంటికి భోజనానికి, ఇప్పుడేమో ఇలా : గట్టిగా ఇచ్చిపడేసిన చిరంజీవి
Send us your feedback to audioarticles@vaarta.com
వైసీపీ ఫైర్ బ్రాండ్, మంత్రి రోజా ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలినీ టార్గెట్ చేయడం కలకలం రేపింది. ఎప్పుడూ పవన్ కళ్యాణ్‌పై మాత్రమే విరుచుకుపడే రోజా నేరుగా మెగా బ్రదర్స్‌పై విమర్శలు గుప్పించడం వైసీపీలోనే చర్చనీయాంశంగా మారింది. చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్‌లను ముగ్గురిని సొంత జిల్లా ప్రజలే ఓడించారంటే వారికి రాజకీయ భవిష్యత్తు లేదనే విషయం అర్ధమవుతోందన్నారు. సినీనటులు అందరికీ సాయం చేస్తారని.. కానీ వీళ్లు మాత్రం అందుకు భిన్నంగా వున్నారంటూ రోజా విమర్శించారు. చంద్రబాబు తప్పులు చేసినప్పుడు పవన్ కల్యాణ్ మూతికి ప్లాస్టర్ వేసుకుంటాడంటూ ఆమె తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఇప్పటంలో గోడలకు ఇచ్చిన విలువ... తొక్కిసలాటలో చనిపోయిన వారికి పవన్ ఇవ్వడం లేదని రోజా ఎద్దేవా చేశారు.
మీది నోరా .. మున్సిపాలిటీ కుప్ప తొట్టా : నాగబాబు
అయితే రోజా వ్యాఖ్యలకు మెగా బ్రదర్స్ హర్ట్ అయ్యారు. ఒకప్పుడు జబర్దస్త్ షోలో తన క్లోజ్ ఫ్రెండ్‌లా వున్న నాగబాబు సైతం రోజాపై విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించి ఆయన ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఇన్నాళ్లు మీరు ఏం మాట్లాడినా స్పందించకపోవడానికి కారణం వుంది. మీ నోటికి.. మున్సిపాలిటీ కుప్పతొట్టికి పెద్దగా తేడా లేదంటూ కౌంటరిచ్చారు. పర్యాటక శాఖ మంత్రి అంటే పర్యటనలు చేయడం కాదని, అభివృద్ధి చేయడమన్న సంగతిని ముందు తెలుసుకోవాలని నాగబాబు చురకలంటించారు. దేశవ్యాప్తంగా పర్యాటకం విషయంలో ఆంధ్రప్రదేశ్ 18వ స్థానంలో వుందని ఆయన దుయ్యబట్టారు.
నా సాయం తీసుకుని ఇప్పుడు ఏం చేయలేదంటున్నారు :చిరంజీవి
ఇక ఎవరు తనపై విమర్శలు చేసినా సైలెంట్‌గా వుండే చిరంజీవి సైతం రోజా వ్యాఖ్యలకు రియాక్ట్ అయ్యారు. వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ కార్యక్రమంలో పాల్గొంటున్న ఆయన.. మీడియాతో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే రోజా వ్యాఖ్యలపై స్పందించారు. ఆమె మాటలపై తాను ఏం మాట్లాడదలచుకోలేదని, రోజా గతంలో తనతో కలిసి పలు చిత్రాల్లో నటించారని గుర్తుచేశారు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్‌లతో పాటు కరోనా సమయంలో సినీ కార్మికుల కోసం చేసిన సాయం ఇవన్నీ తన సహాయం చేసే గుణానికి నిదర్శనమని చిరు చురకలంటించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా రోజా తన ఇంటికి వచ్చి, భోజనం కూడా చేశారని.. సొంత మనిషిలానే తిరిగారని మెగాస్టార్ అన్నారు. తనతో స్నేహంగా వుండి తన సాయం తీసుకున్నవాళ్లు ఇప్పుడు సాయం తీసుకోలేదని చెబుతున్నారని చిరు ఆవేదన వ్యక్తం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments