క్యాన్సర్‌తో బాధపడుతున్న అభిమానిపట్ల ఔదార్యం..  పెద్దమనసు చాటుకున్న చిరంజీవి

తెలుగు చిత్ర సీమలో ఎన్టీఆర్ తర్వాత అంతటి మాస్, కమర్షియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. కోట్లాదిమంది అభిమాన గణంతో సౌత్‌లో తిరుగులేని స్టార్‌గా ఎదిగారు చిరు. తనను ఇంతటి వాడిని చేసిన సమాజానికి ఎంతో కొంత ఇవ్వాలనే ఉద్దేశ్యంతో బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్‌లతో పాటు చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. తనతో పాటు ఈ మంచి పనిలో అభిమానులను కూడా భాగం చేశారాయన. ఇక ఫ్యాన్స్‌కి ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు చిరు ముందుంటారు. అదే వారసత్వాన్ని మిగిలిన మెగా హీరోలు కూడా కొనసాగిస్తున్నారు.

తాజాగా విశాఖపట్నానికి చెందిన మెగాస్టార్ అభిమాని వెంకట్ కొంతకాలంగా క్యాన్సర్ తో బాధ పడుతున్నారు. అయితే వెంకట్ ట్విట్టర్ ద్వారా తన అభిమాన నటుడు చిరంజీవిని కలవాలని తన కోరికను వెలిబుచ్చాడు. దీనికి చలించిపోయిన చిరంజీవి వెంటనే వచ్చి తనను కలవాల్సిందిగా కబురు పంపారు. అయితే వెంకట్ అనారోగ్యం కారణంగా కదిలే పరిస్థితి లేదని చిరంజీవికి తెలియజేశారు ఆయన కుటుంబసభ్యులు. ఇక్కడే చిరంజీవి తన మానవత్వాన్ని మరోసారి నిరూపించారు.

విశాఖపట్నం నుంచి హైదరాబాదు రావడానికి వెంకట్, వెంకట్ భార్య సుజాతకు ఫ్లైట్ టికెట్స్ పంపించారు. అనంతరం వెంకట్ ఆయన భార్య సుజాత చిరంజీవి ఇంట్లో కలిసారు. దంపతులిద్దరితో చిరంజీవి దాదాపు 45 నిమిషాలు గడిపారు. ఆయన ఆరోగ్య పరిస్ధితిని అడిగి తెలుసుకున్న మెగాస్టార్.. వెంకట్‌ను హైదరాబాద్‌లో ఒమేగా ఆసుపత్రిలో చేర్పించారు. ఎంత ఖర్చయినా తన అభిమానికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అవసరమైతే చెన్నైలోని మరో ప్రముఖ ఆసుపత్రికి తరలించి వైద్యం చేయిస్తానని చిరంజీవి భరోసా ఇచ్చారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆరోప్రాణంగా భావించే అభిమానులపై చిరంజీవి చూపే ప్రేమకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.