Chiranjeevi : తమ్ముడికి అడ్డురాను.. రాజకీయాల నుంచి నేనే తప్పుకుంటా : పవన్‌కు మద్ధతిచ్చేలా చిరు కామెంట్స్
- IndiaGlitz, [Wednesday,October 05 2022]
వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యూహాలు రచిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రోడ్లు, ఇతర సమస్యలపై స్పందించడంతో పాటు కౌలు రైతు భరోసా యాత్ర ద్వారా రైతు కుటుంబాలను పవన్ కల్యాణ్ ఆదుకున్నారు. దీనికి తోడు సామాజిక సమీకరణలు, జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. ఏం చేసైనా సరే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చనని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ- టీడీపీలను కలుపుకోవాలని భావిస్తున్నా.. ఒంటరిగా బరిలోకి దిగితే ఎలా వుంటుందనే దానిపైనా పవన్ యోచిస్తున్నారు. పవన్ కల్యాణ్‌కు అటు కుటుంబ సభ్యులు కూడా మద్ధతుగా నిలుస్తున్నారు. కౌలు రైతు భరోసా యాత్రకు మెగా కుటుంబం నుంచి విరాళాలు బాగానే అందాయి.
ప్రకంపనలు రేపిన చిరు ట్వీట్:
ఈ సంగతి పెడితే.. పవన్ పెద్దన్న మెగాస్టార్ చిరంజీవి మద్ధతు ఎవరికి..? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఆయనకున్న సినీ గ్లామర్‌ను క్యాష్ చేసుకోవాలని కాంగ్రెస్, వైసీపీ, బీజేపీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కానీ చిరంజీవి మాత్రం తాను రాజకీయాలకు దూరం అని సున్నితంగా తిరస్కరిస్తూ వస్తున్నారు. కానీ ఆయన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్‌తో చిరు పొలిటికల్ రీఎంట్రీపై విపరీతంగా చర్చ జరుగుతోంది. ‘‘తాను రాజకీయాలకు దూరమైనా.. రాజకీయం మాత్రం తనను వదలడం లేదు’’ అంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ తెలుగు నాట ప్రకంపనలు సృష్టిస్తోంది. దీంతో అన్నయ్య రాజకీయాల్లోకి మరోసారి ఫేస్ టర్నింగ్ ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది.
ఇద్దరం చెరొక వైపు వుంటే పవన్‌కి నష్టం:
ఇలాంటి పరిస్ధితుల నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో తాను జనసేనకు మద్ధతు ఇస్తానో లేదో కాలమే నిర్ణయిస్తుందని ఆయన అన్నారు. తాను తప్పుకుంటేనే పవన్ కల్యాణ్‌కు లాభం చేకూరుతుందేమోనంటూ చిరంజీవి వ్యాఖ్యానించారు. తన తమ్ముడి నిబద్ధత, నిజాయితీ తనకు చిన్నప్పటి నుంచి తెలుసునని.. అలాంటి వ్యక్తి మనకు నాయకుడిగా కావాలని మెగాస్టార్ అన్నారు. తామిద్దరం చెరో వైపు వుండటం కంటే.. తాను తప్పుకోవడమే ఆయనకు హెల్ప్ అవుతుందేమోనని, తాను రాజకీయాల నుంచి వైదొలగడం వల్ల పవన్ మరింత బలోపేతం కావొచ్చని చిరంజీవి స్పష్టం చేశారు.
మెగా- పవన్ ఫ్యాన్స్ ఖుషీ:
అయితే జనసేన పార్టీ పెట్టిన ఈ ఎనిమిదేళ్లలో ఒక్కసారిగా పవన్‌కు మద్ధతుగా చిరు మాట్లాడింది లేదు. కానీ ఒక్కసారిగా పవన్ కళ్యాణ్‌ను సీఎంగా చూడాలని వుందంటూ తన మనసులోని మాటను బయటపెట్టారు మెగాస్టార్. ఏది ఏమైనా చిరు కామెంట్స్‌తో జనసేన కార్యకర్తల్లో కొత్త జోష్ నింపారు చిరు.