Godfather : బాస్ ఈజ్ బ్యాక్.. రెండో రోజూ తగ్గని 'గాడ్ ఫాదర్' కలెక్షన్స్, హిందీలోనూ చిరు మేనియా

గత కొన్నేళ్లుగా స్థాయికి తగ్గ స్టామినా చూపించలేకపోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఖైదీ నెం 150 కలెక్షన్లు కుమ్మేసినప్పటికీ తర్వాత రిలీజ్ అయిన సైరా నర్సింహారెడ్డి, ఆచార్య సినిమాలు మెగా అభిమానులను నిరాశ పరిచాయి. దీంతో అన్ని జాగ్రత్తలు తీసుకుని మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్‌ఫాదర్‌ను రిలీజ్ చేశారు మెగాస్టార్. ఈ సినిమా అంచనాలను అందుకుని బాక్సాఫీస్ వద్ద జైత్రయాత్ర సాగిస్తోంది. వరుసగా రెండోరోజూ మంచి వసూళ్లు లభిస్తున్నాయి. సూపర్‌హిట్ టాక్ రావడంతో పాటు వరుస సెలవులు కావడంతో జనం థియేటర్లకు వస్తుండటంతో బాక్సాఫీస్ కళకళలాడుతోంది.

బాక్సాఫీస్‌కి కళ తెచ్చిన గాడ్‌ఫాదర్:

గాడ్‌ఫాదర్ ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు 38 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేయగా... రెండో రోజు రూ.31 కోట్లు వచ్చినట్లుగా తెలుస్తోంది. సాధారణంగా ఏ సినిమాకైనా తొలిరోజు కలెక్షన్స్ ఎక్కువగా వుండి.. ఆ తర్వాత పడుతూ లేస్తూ వుంటుంది. కానీ గాడ్‌ఫాదర్ విషయంలో రెండో రోజూ మంచి కలెక్షన్లు రావడం విశేషం. మొత్తం రెండు రోజులు కలిపి రూ.69 కోట్లు కలెక్ట్ చేసింది గాడ్‌ఫాదర్. ఇక హిందీలోనూ గాడ్‌ఫాదర్ మంచి వసూళ్లే సాధించినట్లుగా తెలుస్తోంది. తొలి రోజు మూడున్నర కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్లుగా సమాచారం. రెండో రోజు నుంచి థియేటర్ల సంఖ్యను పెంచుతున్న నేపథ్యంలో కలెక్షన్స్ కూడా డబుల్ అయ్యే అవకాశం వుంది.

గాడ్‌ఫాదర్‌ను భుజాలపై మోసిన చిరు :

కాగా.. మలయాళ సినిమా లూసిఫర్‌కు రీమేక్‌గా తెరకెక్కిన గాడ్‌ఫాదర్‌లో చిరంజీవి నట విశ్వరూపం చూపించారు. వయసుకు తగ్గ పాత్ర కావడం, సమకాలీన రాజకీయాలకు సంబంధించిన సబ్జెక్ట్ కావడంతో చిరు తన పాత్రకు ప్రాణం పోశారు. ఇక విలన్‌గా సత్యదేవ్.. చిరంజీవికి ధీటుగా నటించారు. నయనతార కూడా నటనకు స్కోప్ వున్న పాత్ర కావడంతో తన అనుభవంతో ఒదిగిపోయారు. సినిమా సెకండాఫ్‌లో ట్విస్ట్‌లతో పాటు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ పాత్ర అదనపు ఆకర్షణగా నిలిచాయి.