Chiranjeevi:అల్లు అర్జున్ 20 ఇయర్స్ జర్నీ.. చెప్పలేనంత ఆనందంగా వుంది : బన్నీపై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్

  • IndiaGlitz, [Wednesday,March 29 2023]

మెగా ఫ్యామిలీలో చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్‌ల తర్వాత వచ్చిన తర్వాతి తరం నటుడు అల్లు అర్జున్. మామయ్య చిరంజీవి తర్వాత డ్యాన్సుల్లో అంతటి ప్రతిభ గల నటుడిగా బన్నీ గుర్తింపు తెచ్చుకున్నారు. నటన, డైలాగ్ డెలీవరి, ఫైట్లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి.. అప్పుడే 20 ఏళ్లు పూర్తయింది. ఇప్పుడు ఐకాన్ స్టార్‌గా, భారతదేశంలోని అత్యంత డిమాండ్ వున్న నటుల్లో ఒకరిగా బన్నీ నిలిచారు. ఇదంతా ఆయనకు రాత్రికి రాత్రే రాలేదు. దీని వెనుక ఎంతో కష్టం, కృషి, పట్టుదల వున్నాయి. ఈ నేపథ్యంలో బన్నీ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రేక్షకుల ప్రేమ, ఆదరాభిమానాలతో ముందుకు సాగుతున్నానని.. తన ఎదుగుదల వెనుక వున్న స్నేహితులకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

కాలం ఎంతో వేగంగా గడిచిపోయింది :

మరోవైపు నటుడిగా 20 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న అల్లు అర్జున్‌కు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. ‘‘డియర్ బన్నీ.. ఇండస్ట్రీలో నువ్వు 20 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు సంతోషంగా వుంది. నీ చిన్నప్పటి రోజులు నా గుండెల్లో ఇంకా అలాగే వున్నాయి. కాలం ఎంతో వేగంగా గడిచిపోయింది కదా.. ఒక మామూలు నటుడిగా ఎంట్రీ ఇచ్చి పాన్ ఇండియా స్టార్, ఐకాన్ స్టార్‌గా నువ్వు ఎంతో ఎత్తుకు చేరడం చూస్తుంటే చెప్పలేనంత ఆనందంగా వుంది. భవిష్యత్తులో నువ్వు ఎన్నో విజయాలు అందుకోవాలని ఆశిస్తున్నానని’’ చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

పుష్ప 2 కోసం ఎదురుచూస్తోన్న దేశం:

ఇదిలావుండగా.. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2లో నటిస్తున్నారు అల్లు అర్జున్. ఈ సినిమా కోసం టాలీవుడ్‌తో పాటు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోంది. పుష్ప పార్ట్ 1లోని పాటలు, డైలాగ్స్, యాక్షన్ సీన్స్ దేశాన్ని ఎంతగా వెర్రెక్కించాయో తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్ట్ 2లో ఎలాంటి ఎలిమెంట్స్ వుంటాయోనని ఆసక్తి నెలకొంది. సౌత్ కంటే నార్త్ ప్రేక్షకులు పుష్ప 2 కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు బన్నీ. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మించనున్నారు. దీనితో పాటు అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అల్లు అర్జున్. ఈ సినిమా కోసం బన్నీ దాదాపు రూ.125 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని ఇండస్ట్రీ టాక్.