Editor Gowtham Raju: ఎడిటర్ గౌతంరాజు మరణం పట్ల చిరంజీవి దిగ్భ్రాంతి.. రూ.2 లక్షల ఆర్ధిక సాయం
Send us your feedback to audioarticles@vaarta.com
సీనియర్ ఎడిటర్ గౌతంరాజు మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు నాలుగు దశాబ్ధాల సుదీర్ఘ ప్రస్థానంలో 800కు పైగా సినిమాలకు గౌతంరాజు పనిచేశారు. ఈ క్రమంలో గత కొన్నిరోజులుగా కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతోన్న గౌతంరాజు ఆసుపత్రిలో చికిత్స తీసుకుని కోలుకున్నారు. అయితే బుధవారం ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో హైదరాబాద్ లోని తన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలిసి తెలుగు చిత్ర పరిశ్రమ షాక్ కు గురైంది. నటీనటులు, సాంకేతిక నిపుణులు గౌతంరాజుతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు.
చిరు సినిమాతోనే తెలుగులోకి ఎంట్రీ:
ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి సైతం గౌతంరాజు మరణంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిరు నటించిన ‘చట్టానికి కళ్లు లేవు’ సినిమా ఆయన తెలుగులో ఎడిటర్ గా పనిచేసిన తొలి చిత్రం. అప్పటి నుంచి గౌతం రాజుతో చిరంజీవికి అనుబంధం వుండేది. చిరు రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెం 150కి కూడా ఆయనే ఎడిటర్ గా పనిచేశారు. ఈ నేపథ్యంలో తన చిరకాల మిత్రుడి మరణంతో చిరంజీవి షాక్ కు గురయ్యారు. గౌతం రాజు మరణం పట్ల సంతాపం తెలిపిన మెగాస్టార్.. ఆయన కుటుంబానికి రెండు లక్షల రూపాయల ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు. దీనిని దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా అందజేశారు. ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా వుండాలని.. తామంతా అండగా వుంటామని గౌతంరాజు కుటుంబానికి చిరంజీవి చెప్పమన్నట్లు తమ్మారెడ్డి తెలిపారు.
ఆపరేటివ్ కెమెరామెన్‌గా ప్రస్థానం:
1954 జనవరి 15న ప్రకాశం జిల్లా ఒంగోలులో జన్మించారు గౌతంరాజు. ఆయన తల్లిదండ్రులు రంగయ్య, కోదనాయకి. ఈ క్రమంలో గౌతంరాజు కుటుంబం మద్రాస్ కి షిఫ్ట్ కావడంతో.. అక్కడి అరుణాచలం థియేటర్‌లో ఆపరేటివ్ కెమెరామన్ గా కెరీర్ ప్రారంభంచారు. ఎడిటర్, డైరెక్టర్ సంజీవి దగ్గర ఎన్నో మెళకువలు నేర్చుకున్నారు. తమిళ చిత్రం ‘అవళ్ ఓరు పచ్చికొళందై’తో ఎడిటర్ గా మారారు. చిరంజీవి నటించిన చట్టానికి కళ్లు లేవు చిత్రానికి గాను తెలుగులో తొలిసారి పనిచేశారు. అనంతరం దర్శకుడు జంధ్యాలతో సాన్నిహిత్యం కారణంగా ఆయన దర్శకత్వం వహించిన అన్ని చిత్రాలకు గౌతంరాజే ఎడిటర్ గా పనిచేశారు. నాలుగు దశాబ్ధాల సుదీర్ఘ ప్రస్థానంలో దాదాపు 800 పైచిలుకు సినిమాలకు ఎడిటర్ గా పనిచేసి టాలీవుడ్ లో అగ్రశ్రేణి ఎడిటర్ గా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనను ఆరు సార్లు నంది అవార్డులతో సత్కరించింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మళయాళం, హిందీ చిత్రాలకు కూడా గౌతంరాజు పనిచేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout