నన్ను రాజకీయాల్లోకి మనస్పూర్తిగా ఆహ్వానించారు... రోశయ్య మరణంపై చిరంజీవి ఎమోషనల్
- IndiaGlitz, [Saturday,December 04 2021]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (88) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రజా జీవితంలో రోశయ్య ఒక మహోన్నత నేత అని కొనియాడారు. రాజకీయ విలువలు, అత్యున్నత సంప్రదాయాలు కాపాడటంలో ఓ రుషి మాదిరిగా సేవ చేశారని చిరంజీవి ప్రశంసించారు. రోశయ్య కన్నుమూతతో రాజకీయాలలో ఓ శకం ముగిసిందని వ్యాఖ్యానించారు. రోశయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తనను రాజకీయాల్లోకి రావాలని మనస్ఫూర్తిగా రోశయ్య ఆహ్వానించారని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. వివాదరహితులుగా, నిష్కళింకితులుగా ప్రజమన్ననలు పొందారని మెగాస్టార్ పేర్కొన్నారు.
ఇక రోశయ్య మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన సౌమ్యుడిగా, సహనశీలిగా రాజకీయాల్లో తనదైన శైలిని ప్రదర్శించారని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. అటు ఏపీ సీఎం వైఎస్ జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తదితరులు కూడా రోశయ్య మరణం పట్ల సంతాపం తెలిపారు.
కాగా.. శనివారం ఉదయం లోబీపీ రావడంతో రోశయ్యను కుటుంబసభ్యులు హుటాహుటిన బంజారాహిల్స్ స్టార్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వృద్ధాప్యం కారణంగా రోశయ్య చాలా కాలంగా ఇంటికే పరిమితమై, ప‍్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన మృతిపట్ల ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ పెద్దలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Shri #KonijetiRosaiah Garu #RestInPeace pic.twitter.com/jp8KPuWCuJ
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 4, 2021