అదో కళాఖండం .. మైండ్ బ్లోయింగ్, ఆర్ఆర్ఆర్‌పై చిరు రివ్యూ

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ‘‘ఆర్ఆర్ఆర్’’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు జనం బ్రహ్మారథం పడుతున్నారు. ప్రతి చోట పాజిటివ్ టాక్‌ రావడంతో చిత్రయూనిట్ సంబరాలు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో సామాన్యులతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఆర్ఆర్ఆర్‌ను వీక్షించారు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబం సభ్యులతో కలిసి ట్రిపుల్ ఆర్ సినిమాను హైదరాబాద్ లోని AMB సినిమాస్ లో వీక్షించారు. చిరంజీవి తల్లి అంజనా దేవి, కూతుర్లు సుష్మిత , శ్రీజ, మనువరాళ్ల తో కలిసి చిరంజీవి ఆర్ఆర్ఆర్‌ను చూశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్ఆర్ఆర్ ఎలా ఉంది అంటే.. చెప్పడానికి మాటలు లేవని.. సింప్లి సూపర్బ్ అని కాంప్లిమెంట్ ఇచ్చారు. ముఖ్యంగా సినిమాలో చరణ్, తారక్ ల మధ్య బాండింగ్ బాగుందన్నారు. ఇద్దరు డ్యాన్స్ లో ఒకరితో నొకరు పోటీపడి చేశారని చిరు ప్రశంసించారు. చలన చిత్ర పరిశ్రమలో ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని.. స్టార్ హీరోలు కలిసి నటించాలని మెగాస్టార్ ఆకాంక్షించారు.

ఇంటికి వెళ్లిన తర్వాత మళ్లీ తన ట్విట్టర్‌కు పని చెప్పారు చిరు. 'కథలను తెరకెక్కించడంలో మాస్టర్ అనిపించుకున్న వ్యక్తి నుంచి వచ్చిన అద్భుత కళాఖండం ఆర్ఆర్ఆర్' అని మెగాస్టార్ ప్రశంసించారు. సమ్మోహితుల్ని చేసేలా, వెలుగుదివ్వెలా ఉన్న ఈ చిత్రం రాజమౌళి అసమాన దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం అని అభివర్ణించారు. యావత్ చిత్ర బృందానికి హ్యాట్సాఫ్ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.