చెమట, రక్తం చిందించారు... ఫలితం దక్కాలి: పుష్ప టీమ్‌కు మెగాస్టార్ ఆల్‌ ది బెస్ట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ ‘‘పుష్ప’’. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాల్లో దూసుకెళ్తోంది. దీంతో హీరో దగ్గరి నుంచి ప్రతి ఒక్కరూ బిజీగా వున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పాటలు పుష్పపై అంచనాలను పెంచేయడంతో టాలీవుడ్ సహా యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ ‘‘పుష్ప’’ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తోంది. తాజాగా చిరంజీవి ఈ సినిమా గురించి చేసిన ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా కోసం చెమట చిందించి ఎంతో నిబద్ధతతో పనిచేశారు. మీరు పడ్డ శ్రమకు ప్రశంసలు దక్కాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా అంటూ మెగాస్టార్ ఆకాంక్షించారు.

ఇక.. పుష్పలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ నటిస్తుండగా.. అనసూయ, సునీల్, ధనుంజయ్, రావు రమేశ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియాలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గత సోమవారం విడుదలైన ట్రైలర్‌, నిన్న బయటకొచ్చిన సమంత ఐటెం సాంగ్‌తో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

మరోవైపు పుష్ప హిందీ వెర్ష‌న్ కు సెన్సార్ బోర్డు నుంచి క్లియ‌రెన్స్ స‌ర్టిఫికెట్ రాలేద‌నే వార్త బన్నీ అభిమానులను కలవరపాటుకు గురిచేస్తోంది. మేక‌ర్స్ కంప్లీట్ ప్రింట్‌ను పంప‌క‌పోవ‌డంతో రా మెటీరియల్‌ను చూసేందుకు సెన్సార్ బోర్డు స‌భ్యులు నో చెప్పిన‌ట్టు బీటౌన్ స‌ర్కిల్ టాక్‌. అయితే ఆ త‌ర్వాత మేక‌ర్స్ తుది కాపీని సెన్సార్ బోర్డుకు పంపించగా.. ఈరోజు దీనిపై స్ప‌ష్ట‌త రానుంద‌నే టాక్ వినిపిస్తోంది.