బాస్ ఈజ్ బ్యాక్.. కోవిడ్ తగ్గిందో లేదో సెట్‌లో వాలిపోయిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్‌కు శుభవార్త. కొద్దిరోజుల క్రితం కరోనా బారినపడిన ఆయన వైరస్ నుంచి కోలుకున్నారు. ఈ మేరకు ఆదివారం సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. అంతేనా క్షణం కూడా ఆలస్యం చేయకుండా షూటింగ్ స్పాట్‌లో పనిమొదలెట్టేశారు. తనకు కరోనా నెగటివ్‌గా నిర్దార‌ణ అయ్యిందని... ఫుల్ ఎన‌ర్జీతో మ‌ళ్లీ యాక్ష‌న్ స్టార్ట్ చేశానని.. తాను త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుకున్న అంద‌రికీ ధ‌న్య‌వాదాలు అని చిరు ట్వీట్ చేశారు. ఇందులో లొకేష‌న్‌లో ఉన్న ఫొటోల‌ను ఆయన షేర్ చేశారు. ‘గాడ్ ఫాదర్’ షూటింగ్‌లో చిరంజీవి పాల్గొంటున్నారు.

ఇక చిరంజీవి వరుసపెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మోహన రాజా దర్శకత్వంలో గాడ్‌ఫాదర్‌తో పాటు మెహర్ రమేశ్ దర్శకత్వంలో భోళా శంకర్, బాబీ డైరెక్షన్‌లో ‘‘వాల్తేర్ వీరయ్య’’, వెంకీ కుడుముల దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు మెగాస్టార్.

ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటించిన ఆచార్యను ఏప్రిల్ 29న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, సినీ పెద్దలతో చర్చలు జరిపిన అనంతరం.. పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అచార్య యూనిట్ ఒక ప్రకటనలో తెలిపింది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ సంయుక్తంగా నిర్మించిన ఆచార్యలో కాజల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. రామ్‌చరణ్, పూజాహెగ్డే, సోనూసూద్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్ప‌టికే ఆచార్య నుంచి విడుద‌లైన 'లాహె లాహె', 'నీలాంబ‌రీ' ‘శానా కష్టం’ పాటలు ప్రేక్ష‌కుల‌ను విశేషంగా అల‌రించాయి.