టాలీవుడ్‌కు పెద్దదిక్కుగా ఉండను... పంచాయతీలు చేయను: చిరంజీవి కీలక వ్యాఖ్యలు
- IndiaGlitz, [Sunday,January 02 2022]
మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినీ పరిశ్రమకు పెద్దగా ఉండటం తనకు అస్సలు ఇష్టం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆ హోదా తనకిష్టం లేదని చిరు పేర్కొన్నారు. యోధ లైఫ్ లైన్ డయాగ్నోస్టిక్స్ సెంటర్ సినీ పరిశ్రమలోని అన్ని విభాగాల వారికి లైఫ్ హెల్త్ కార్డులను పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చింది. పరిశ్రమలోని అందరికి 50 శాతం రాయితీతో టెస్టులు చేస్తామని ఆ సంస్థ ప్రకటించింది. దీనిలో భాగంగా ఆదివారం జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌లో కార్డుల పంపిణీ జరగ్గా.. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా సినీ కార్మికులు మాట్లాడుతూ.. గడిచిన కొన్నేళ్లుగా తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు అంటూ ఎవరూ లేరు. ఆ బాధ్యత చిరంజీవి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. తమకు ఏదైనా సమస్య వస్తే వెంటనే ఆయన ఉన్నారని మాకు ఓ ధైర్యం ఉంటుంది అని మెగాస్టార్‌ను కోరారు. దానిపై స్పందించిన చిరు.. పెద్దరికం హోదా తనకు ఇష్టం లేదని, నేను పెద్దగా వ్యవహరించనని ఆయన అన్నారు. ఆ పదవి తనకు వద్దని... కానీ, బాధ్యత గల ఒక బిడ్డగా ఉంటానని చిరు పేర్కొన్నారు.
అందరి బాధ్యతా తీసుకుంటానని... అందుబాటులో తానూ ఉంటానన్నారు. అవసరం వచ్చినప్పుడు తప్పకుండా ముందుకు వస్తానని.. అనవసరమైన వాటికి మాత్రం ముందుకు వచ్చే ప్రసక్తే లేదని చిరంజీవి వెల్లడించారు. ఎవరైనా ఇద్దరు వ్యక్తులు, రెండు యూనియన్ల మధ్య వివాదం జరిగితే.. ఆ తగువులు తీర్చాలని నా వద్దకు వస్తే తాను ఆ పంచాయితీ చేయనని ఆయన తేల్చిచెప్పారు. అయితే సినీ కార్మికులకు ఆరోగ్య, ఉపాధి సమస్యలు వచ్చినప్పుడు తప్పకుండా వారి కోసం నిలబడతానని చిరంజీవి వెల్లడించారు.