పెరట్లో ఆనపకాయలు చూసి మురిసిపోతూ... రైతుకి సెల్యూట్ చేసిన చిరు
- IndiaGlitz, [Friday,December 24 2021]
మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా వుంటారన్న సంగతి తెలిసిందే. తన సినిమాలు, వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ వుంటారు. అలాగే సమకాలీన అంశాలపైనా ఆయన స్పందిస్తూ వుంటారు. తాజా ‘‘జాతీయ రైతు దినోత్సవం’’ సందర్భంగా దేశంలోని అన్నదాతలందరికీ చిరు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేశారు. అందులో ఆయన పెరట్లో పెరిగిన ఆనపకాయను చూపిస్తూ సంబరపడ్డారు.
'పెరట్లో ఆనపకాయ కాస్తేనే నాకు ఇంత సంతోషమనిపిస్తే.. మట్టి నుండి పంట పండించి మనందరికీ అన్నం పెట్టే రైతు ఇంకెంత సంతోషంగా ఉండాలి. అలా ఉండేలా మనమే చూసుకోవాలి' అని విజ్ఞప్తి చేశారు. అంతే కాకుండా రైతులందరికీ చిరంజీవి సెల్యూట్ కూడా చెప్పారు. ప్రకృతి ఎంతో గొప్పదని... మన సరదాగా ఒక విత్తనం నాటితే… అది మనకు కడుపు నింపే ప్రయత్నం చేస్తుందని చిరు అన్నారు. మీరు కూడా ఇంట్లో ఒక తొట్టిలోనైనా విత్తనం నాటండి… స్వయంగా పండించిన కూరగాయలతో వండిన వంట ఎంతో రుచికరంగా ఉంటుందని చిరంజీవి వ్యాఖ్యానించారు.
ఇక సినిమాల విషయానికి వస్తే... కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటించిన ‘‘ఆచార్య’’ ఫిబ్రవరి 4న థియేటర్లలోకి రానుంది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ సంయుక్తంగా నిర్మించిన ఆచార్యలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. చరణ్, పూజాహెగ్డే కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆచార్య తర్వాత మోహనరాజా దర్శకత్వంలో గాడ్‌ఫాదర్ సినిమాలో చిరంజీవి నటిస్తున్నారు. దీనితో పాటు మెహర్ రమేశ్ డైరెక్షన్‌లో భోళా శంకర్, బాబీ డైరెక్షన్‌లో ‘‘వాల్తేర్ వీరయ్య’’, వెంకీ కుడుముల దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు.