రాజకీయాలకు దూరం.. పదవులకు ఆశపడే వాడిని కాదు: రాజ్యసభ ఆఫర్‌పై తేల్చేసిన చిరంజీవి
- IndiaGlitz, [Friday,January 14 2022]
మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు శుక్రవారం కృష్ణా జిల్లా డోకిపర్రు వచ్చారు చిరంజీవి. అక్కడ ప్రముఖ పారిశ్రామికవేత్త మెగా కృష్ణారెడ్డి ఇంట్లో గోదాదేవి కల్యాణోత్సవానికి చిరు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాలకు తాను దూరంగా ఉన్నానని చిరు స్పష్టం చేశారు. తనకు వైసీపీ రాజ్యసభ సీటు ఇస్తున్నట్టు వస్తున్న వార్తలకు చెక్ పెట్టారు.
తాను పదవులకు లోబడే వ్యక్తిని కాదని.. తనకు రాజ్యసభ సీటు ఇస్తున్నట్లు వస్తున్న వార్తలు ఊహాజనితమేనని చిరంజీవి అన్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్న తనకు ఇలాంటి ఆఫర్లు రావని, వాటిని కోరుకోనని ఆయన పేర్కొన్నారు. సినీ పరిశ్రమకు చెందిన సమస్యలు, మూవీ టికెట్ ధరల గురించి చర్చించేందుకు చిరంజీవి గురువారం మధ్యాహ్నం ఏపీ సీఎం జగన్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. దీంతో చిరంజీవికి వైసీపీ కోటాలో రాజ్యసభ సీటు ఇస్తున్నట్టు తెలుగు మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది.
అనంతరం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో చిరు మీడియాతో మాట్లాడారు. సినిమా టికెట్ ధరల విషయంపై జగన్‌తో జరిగిన చర్చ సంతృప్తినిచ్చిందన్నారు. తనకెంతో ఆనందంగా ఉందని.. సీఎం తనను ఓ సోదరుడిగా పండగ వేళ భోజనానికి ఆహ్వానించారని చిరు పేర్కొన్నారు. తనను ఎంతగానో ఆదరించిన వైఎస్ జగన్ ఆయన సతీమణి భారతీకి చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. సినిమా టికెట్ ధరల విషయంపై కొన్ని రోజులుగా మీమాంస ఉందని.. అగమ్యగోచర పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒక కోణంలోనే వినటంకాదు రెండో కోణంలోనూ వినాలని మెగాస్టార్ సూచించారు. ఆయన తన పెట్టిన నమ్మకం, భరోసా ఎంతో బాధ్యతగా అనిపించిందని.. సినీ పరిశ్రమలో ఎవరూ మాట జారొద్దని చిరంజీవి కోరారు.