Chiranjeevi Home Tour : రాయల్ ప్యాలెస్‌ని తలపించే మద్రాస్‌లోని చిరు ఇల్లు.. అబ్బో ఎన్ని వింతలో..!!
- IndiaGlitz, [Thursday,December 01 2022]
మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియనివారుండరు. స్వయంకృషి, పట్టుదల, క్రమశిక్షణతో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా తెలుగు సినీ పరిశ్రమలో స్టార్‌గా ఎదిగారు. దాదాపు మూడు దశాబ్ధాల పాటు టాలీవుడ్‌ను మకుటం లేని మహారాజుగా ఏలారు. ఒకానొక దశలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్‌ను మించిన స్థార్‌గా, ఆయన కంటే ఎక్కువ పారితోషికం తీసుకునే నటుడిగా చిరంజీవి సంచలనం సృష్టించారు. అయితే ఎంత ఎదిగినా ఒదిగివుండే తత్వం, మంచితనం, మానవత్వం మెగాస్టార్ సొంతం. అందుకే ఆయనను స్పూర్తిగా తీసుకుని ఎంతోమంది హీరోలు, టెక్నీషియన్లు వెండితెరపైకి వచ్చారు.. వస్తున్నారు.
బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకులతో సమాజసేవ:
ఇకపోతే.. తనను ఈస్థాయికి తీసుకొచ్చిన సమాజానికి, భారతదేశానికి ఎంతో కొంత సాయం చేయాలనే ఉద్దేశంతో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ పేరిట ఆయన బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ నిర్వహిస్తూ లక్షలాది మంది ప్రాణాలను నిలబెట్టారు. ఇక కరోనా సమయంలో కోట్లాది రూపాయలను ఖర్చుపెట్టి.. ఆక్సిజన్ ప్లాంట్లు, రెమిడిసెవర్ వంటి మందులను అందించి ఎంతోమందికి ప్రాణదానం చేశారు.
చెన్నైలో చిరంజీవికి ప్యాలెస్ లాంటి ఇల్లు :
ఒకప్పుడు పేదరికంతో కష్టాలు అనుభవించిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వేల కోట్లకు అధిపతి. ఇదంతా రాత్రికి రాత్రే వచ్చేయలేదు. దీని వెనుక ఆయన ఎన్నో ఏళ్ల కష్టం వుంది. రూపాయి రూపాయిని కూడబెడుతూ, ఒక్కో మెట్టు ఎక్కుతూ చిరు ఈ స్థాయికి చేరుకున్నారు. అంతేకాదు.. ఆపదలో వున్న ఎంతోమందికి మెగాస్టార్ సాయం చేశారు, చేస్తున్నారు. ఆయనకు తెలుగు రాష్ట్రాలతో పాటు మరికొన్ని చోట్ల కూడా కోట్లాది రూపాయల ఆస్తులు వున్నాయి. అందులో ఒకటి చెన్నైలోని ఇల్లు. సినిమా అవకాశాల కోసం మద్రాస్‌కు వెళ్లిన చిరంజీవి అనంతరం సుప్రీం హీరోగా, మెగాస్టార్ స్థాయికి చేరుకున్నారు. తొలినాళ్లలో చెన్నైలోనే తన కుటుంబం కోసం అందమైన ఇంటిని నిర్మించారు. కానీ తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌కు తరలిరావడంతో ఆయన కూడా తన మకాంను భాగ్యనగరానికి మార్చారు.
2002లో చెన్నైలోని ఇంటిని అమ్మేసిన చిరంజీవి :
మరి కొణిదెల కుటుంబానికి ఎంతో అపురూపమైన ఆ ఇంటిపై indiaglitz హోమ్ టూర్ నిర్వహించింది. ఆ ఎక్స్‌క్లూజివ్ వివరాలు మీ కోసం. చిరంజీవి హైదరాబాద్‌లో స్థిరపడిన తర్వాత ఓ డాక్టర్‌కి ఆ ఇంటిని 2002లో విక్రయించారు. 2011లో కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించినప్పుడు చిరంజీవి ఇక్కడికి వచ్చారని, అలాగే ఆయన కుమారుడు రామ్ చరణ్ కూడా ఒకసారి వచ్చి తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారని ఇంటి యజమాని అయిన డాక్టర్ నరేశన్ తెలిపారు.
ఆస్తి పేపర్లపై సంతకం చేసింది అల్లు అరవిందే:
నాడు చిరంజీవి తరపున అల్లు అరవింద్ ఇంటి పత్రాలపై సంతకాలు చేశారని డాక్టర్ నరేశన్ తెలిపారు. చిరంజీవి నుంచి ఇంటిని కొనుగోలు చేసిన తర్వాత కేవలం ఫర్నిచర్ మాత్రమే మార్పులు చేర్పులు చేసినట్లు డాక్టర్ వెల్లడించారు. ఈ ఇంటిలో 6 బెడ్రూమ్స్ వున్నాయని.. తన కొడుకు, కూతురు విదేశాల్లో వున్నందున కేవలం ఒకే ఒక్క బెడ్రూమ్ని తాను, తన భార్య వాడుతున్నట్లు నరేశన్ తెలిపారు. మద్రాస్‌లోని చిరంజీవి ఇంట్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది పూజగది. ఆ కాలంలోనే విలువైన కలపతో చాలా అందంగా పూజగదిని తన అభిరుచికి తగ్గట్లుగా నిర్మించారు మెగాస్టార్. 1985లలోనే ఆర్కిటెక్ట్‌ని లండన్ నుంచి పిలిపించి డిజైన్ చేయించారని నరేశన్ తెలిపారు. అలాగే చిరంజీవి బెడ్ రూమ్ కూడా వుడ్ వర్క్‌తో, చుట్టూ అద్దాలతో చూడగానే ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దారు.
మహేశ్ బాబుకు ఇంజెక్షన్ చేశా :
ఇకపోతే.. చిరంజీవితో ఇటీవల కన్నుమూసిన సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబంతో తనకు అనుబంధం వుందని నరేశన్ చెప్పారు. కిలాడీ కృష్ణుల్లో కృష్ణ గారి పక్కన కాస్త సెట్ అయ్యేలా విజయశాంతి లావు అయ్యేందుకు తాను ఇంజెక్షన్ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ వార్త అప్పట్లో అన్ని పత్రికల్లో వచ్చిందని నరేశన్ పేర్కొన్నారు. విజయనిర్మలకు ఈ ప్రాంతంలో రెండు మూడు ఫ్లాట్స్ వున్నాయని ఆయన చెప్పారు. అలాగే మహేశ్ బాబు చిన్నప్పుడు అతనికి ఇంజెక్షన్ కూడా చేసినట్లు నరేశన్ గుర్తుచేసుకున్నారు.