Ram Charan:హైదరాబాద్‌లో చరణ్‌కు ఘనస్వాగతం .. అభిమానులతో కిక్కిరిసిన బేగంపేట్ , అర్ధరాత్రి కూడా క్రౌడ్ తగ్గలేదుగా

  • IndiaGlitz, [Saturday,March 18 2023]

ఆర్ఆర్ఆర్‌లోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ లభించిన తర్వాత తొలిసారిగా హైదరాబాద్‌కు చేరుకున్న మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌కు అభిమానులు ఘనస్వాగతం పలికారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్ ప్రాంగణం నుంచి చెర్రీ బయటకు రాగానే ‘‘జై చరణ్’’, ‘‘జై ఆర్ఆర్ఆర్’’ నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది. అనంతరం అభిమానులకు అభివాదం చేసిన ఆయన ర్యాలీగా తన నివాసానికి బయల్దేరారు. ఈ సందర్భంగా చరణ్‌ను అభిమానులు అనుసరించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆస్కార్ తర్వాత హైదరాబాద్‌కు రాకుండా ఢిల్లీకి :

కాగా ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ముగిసిన తర్వాత ఆర్ఆర్ఆర్ టీమ్ మొత్తం హైదరాబాద్‌కు తిరిగి వచ్చేయగా.. చరణ్ మాత్రం న్యూఢిల్లీలో దిగారు. అక్కడ ఆయనకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఆర్ఆర్ఆర్ బ్యానర్లు, చరణ్ ఫ్లెక్సీలతో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ నిండిపోయింది. ఈ సందర్భంగా చెర్రీ మీడియాతో మాట్లాడుతూ.. తాను చాలా సంతోషంగా వున్నానని అన్నారు. కీరవాణి, రాజమౌళి, చంద్రబోస్‌లను చూసి తాము గర్విస్తున్నామని.. వారి కారణంగానే రెడ్ కార్పెట్‌పై వెళ్లి భారతదేశానికి ఆస్కార్ తీసుకురాగలిగామని చరణ్ పేర్కొన్నారు. నాటు నాటు ఇండియన్ సాంగ్ అని ఆయన వెల్లడించారు.

ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న చరణ్ :

సాయంత్రం ఇండియా టుడే కాన్‌క్లేవ్ 2023లో ప్రధాని నరేంద్ర మోడీ, సచిన్ టెండూల్కర్ తదితర ప్రముఖులతో చరణ్ వేదికను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ , ఆస్కార్ అవార్డులకు సంబంధించిన వివరాలను ఆయన తెలియజేశారు. అనంతరం బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి చరణ్ కలిశారు. ఈ సందర్భంగా చరణ్‌ను హోంమంత్రి శాలువాతో సత్కరించారు. నాటు నాటుకు ఆస్కార్ రావడంతో పాటు ఆర్ఆర్ఆర్ ఘన విజయం సాధించడం పట్ల చరణ్‌ను అమిత్ షా అభినందించారు. అనంతరం ముగ్గురూ కాసేపు ముచ్చటించుకున్నారు. దీనికి సంబంధించి అమిత్ షా ట్వీట్ చేశారు. భారతీయ చిత్రసీమలోని ఇద్దరు దిగ్గజాలు చిరంజీవి, రామ్‌చరణ్‌లను కలవడం ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. తెలుగు సినిమా పరిశ్రమ భారతదేశ సంస్కృతి , ఆర్థిక వ్యవస్థను గణనీయంగా ప్రభావితం చేసిందని అమిత్ షా ప్రశంసించారు. అటు మెగాస్టార్ చిరంజీవి సైతం అమిత్ షాను కలవడం పట్ల ట్వీట్ చేశారు. ఈ కార్యక్రమంలో తాను భాగం కావడం థ్రిల్లింగ్‌గా అనిపించిందన్నారు.