రూ.100 కోట్లా.. నాకు ఎవరిస్తారు : రెమ్యూనరేషన్‌ వార్తలపై తేల్చేసిన రామ్‌చరణ్

  • IndiaGlitz, [Friday,December 31 2021]

తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు తీసే స్థాయికి చేరుకుంది. అదే సమయంలో హీరోలు, హీరోయిన్లు, దర్శకుల పారితోషకాలు కూడా బాగా పెరిగాయి. ఈ క్రమంలోనే రకరకాల గాలి వార్తలు పుడుతూ .. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటిని నిజమని నమ్మిన కొందరు అభిమానులు.. తమ హీరో రెమ్యూనరేషన్ గురించి గొప్పలు చెప్పుకుంటూ వుంటారు. కానీ ఇలాంటి వార్తలు సదరు హీరో, హీరోయిన్లకు సమస్యలు తెచ్చిపెడుతూ వుంటాయి. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ్ పారితోషికంపై విపరీతంగా కథనాలు వచ్చాయి. చెర్రీ తన నెక్స్ట్‌ సినిమాకు రూ.100 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇది ఆయన దృష్టికి వెళ్లడంతో చరణ్ కొట్టిపారేశాడు. అసలు వంద కోట్లు ఎక్కడున్నాయి? ఉన్నా నాకెవరు ఇస్తారు? అని తిరిగి ప్రశ్నించారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్- ఎన్టీఆర్ కలిసి నటించిన ‘‘ఆర్ఆర్ఆర్’’ జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రామ్‌చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్‌.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఓలివియా మోరిస్‌ కనిపించనున్నారు. శ్రియా శరన్, అజయ్‌దేవ్‌గణ్‌ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్యలో రామ్‌చరణ్ ఓ కీలక పాత్ర పోషించారు. ఆ వెంటనే తమిళ దర్శక దిగ్గజం శంకర్‌తో ఓ మూవీని పట్టాలెక్కించిన చరణ్.. దాని షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తుండగా.. థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఎప్పటిలాగే అవినీతినే శంకర్ తన సినిమా ఇతివృత్తంగా తీసుకున్నట్లుగా ఫిలింనగర్ టాక్.