5 నెల‌ల మెగా సంద‌డి

  • IndiaGlitz, [Saturday,November 18 2017]

మెగాఫాన్స్ కి 2017 మిక్స్‌డ్ ఇయ‌ర్‌గానే చెప్పొచ్చు. ఈ సంవ‌త్స‌రం మెగా క‌థానాయ‌కులు న‌టించిన చిత్రాల్లో 'ఖైదీ నంబర్ 150', 'ఫిదా' మూవీస్ మాత్రమే బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని అందుకోగలిగాయి. అయితే ఎన్నో అంచనాల మధ్య వచ్చిన 'కాటమరాయుడు', 'దువ్వాడ జగన్నాధం' ఫాన్స్ ని నిరుత్సాహపరిచాయి.

వీటితో పాటు మిస్ట‌ర్‌, విన్న‌ర్, న‌క్ష‌త్రం వంటి మెగా హీరోల సినిమాలు సైతం బాక్సాఫీస్ వ‌ద్ద ఏ మాత్రం సంద‌డి చేయ‌లేకపోయాయి. అయితే.. డిసెంబ‌ర్‌ నుంచి ఏప్రిల్ వరకు నెలకో మెగా హీరో సినిమా రానుండ‌డంతో మెగాభిమానుల్లో మ‌ళ్లీ ఉత్సాహం నెల‌కొంది. 'తిక్క', 'విన్నర్', 'నక్షత్రం' సినిమాల ఫ్లాప్ లతో డీలా పడ్డ హీరో సాయిధరమ్‌ తేజ్.. బి.వి.ఎస్.రవి దర్శకత్వంలో తెరకెక్కిన 'జవాన్'తో డిసెంబర్ నెలలో వస్తున్నాడు.

ఇక‌, జనవరిలో త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన 'అజ్ఞాతవాసి'తో పవన్ కళ్యాణ్ సంక్రాంతి బరిలో దిగుతున్నాడు. ఫిబ్రవరిలో వెంకీ అట్లూరి డైరెక్షన్లో వరుణ్ తేజ్ నటించిన చిత్రం 'తొలిప్రేమ' రానుంది. అలాగే వి.వి.వినాయక్ దర్శకత్వంలో సాయిధరమ్‌ తేజ్ హీరోగా సినిమా కూడా అదే స‌మ‌యంలో సంద‌డి చేయ‌నుంది.

ఈ రెండూ కూడా శివరాత్రికి అటుఇటు గా థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమౌతున్నాయి. అలాగే ఫిబ్ర‌వ‌రిలో అల్లు శిరీష్ న‌టించిన ఒక్క క్ష‌ణం కూడా రిలీజ‌వుతుంద‌ని వినిపిస్తోంది. ఇక మార్చి విష‌యానికి వ‌స్తే.. రామ్‌చ‌ర‌ణ్ హీరోగా సుకుమార్ రూపొందిస్తున్న‌ 'రంగస్థలం 1985' ఆ నెల‌లో విడుదలకు సిద్ధంగా ఉంది.

చివ‌ర‌గా ఏప్రిల్ లో అల్లు అర్జున్ హీరోగా న‌టిస్తున్న‌ 'నా పేరు సూర్య' సంద‌డి చేయ‌నుంది. ఈ రకంగా ఐదు నెలలపాటు మెగా ఫాన్స్ కి కన్నుల పండుగను ఇవ్వడానికి సిద్ధపడ్డారు మెగా హీరోలు.