మెగాభిమానుల‌కు ఆ విష‌యంలో నిరాశ త‌ప్ప‌దా?

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య‌’. మెసేజ్ మిక్స్ చేసిన క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌ను తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. నిరంజ‌న్ రెడ్డి, రామ్‌చ‌ర‌ణ్ నిర్మాత‌లు. ప్రస్తుతం హైద‌రాబాద్‌లో చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా జ‌రుగుతున్న సమయంలో కరోనా వైరస్ ప్రభావంతో చిత్రీకరణ ఆగింది. నిజానికి ఈ చిత్రాన్ని ఆగ‌స్ట్ 14న విడుద‌ల చేయాల‌నుకుని మెగాస్టార్ చిరంజీవి అండ్ టీమ్ భావించార‌ట‌. అయితే క‌రోనా సినిమాపై పెద్ద ప్ర‌భావాన్నే చూపించింది. క‌రోనా ప్ర‌భావం త‌గ్గిన త‌ర్వాత షూటింగ్ మొద‌లెట్టినా చిరంజీవి పార్ట్ పూర్తి చేస్తారు. త‌ర్వాతచిరంజీవి, కాజ‌ల్ మ‌ధ్య స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించాల్సి ఉంది. త‌ర్వాత కీల‌క పాత్ర‌లో న‌టించే రామ్‌చ‌ర‌ణ్ పాత్ర‌ను చిత్రీక‌రించాల్సి ఉంది.

ఇవ‌న్నీ పూర్తి చేసి సినిమాను విడుద‌ల చేయాలంటే స‌మ‌యం ప‌ట్టేలానే ఉంది. ఒక ప‌క్క కెజియ‌ఫ్ 2 సినిమాతో పాటు వ‌చ్చే ఏడాది సంక్రాంతికి రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్, చ‌ర‌ణ్ న‌టిస్తోన్న రౌద్రం ర‌ణం రుధిరం సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. కాబ‌ట్టి ఈ పోటీ మ‌ధ్య కాకుండా వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో సినిమాను విడుద‌ల చేస్తే ఎలా ఉంటుంద‌ని యూనిట్ ఆలోచిస్తుంద‌ట‌. ఇలా జ‌రిగితే మెగాభిమానుల‌కు ఈ ఏడాది నిరాశ త‌ప్ప‌ద‌నే భావించాలి. అయితే వ‌చ్చే ఏడాది మాత్రం డ‌బుల్ ధ‌మాకా ఉంటుంద‌ని చెప్ప‌డంలో అతిశ‌యోక్తి లేదు.