కాల‌మిస్ట్ తప్పిదం.. మెగాఫ్యాన్స్ ఫైర్‌

  • IndiaGlitz, [Monday,June 08 2020]

ఉత్త‌ర భార‌త‌దేశానికి చెందిన కాల‌మిస్ట్‌, న‌వ‌లా ర‌చ‌యిత శోభా డే చేసిన చిన్న త‌ప్పు పెద్ద స‌మ‌స్య‌గా మారింది. వివ‌రాల్లోకెళ్తే.. ఆదివారం క‌న్నడ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన చిరంజీవి స‌ర్జా క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. విష‌యం తెలుసుకున్న శోభాడే త‌న సంతాపాన్ని తెలియ‌జేస్తూ ఓ స్టార్‌ను కోల్పోయామ‌ని ట్వీట్ చేశారు. ఈమె చేసిన పొర‌పాటు ఏంటంటే చిరంజీవి స‌ర్జా ఫొటో బ‌దులు మెగాస్టార్ చిరంజీవి ఫొటోను పోస్ట్ చేయ‌డ‌మే. దీంతో శోభాడేపై మెగాభిమానులు సోష‌ల్ మీడియాలో ఫైర్ అయ్యారు. త‌న త‌ప్పును గుర్తించిన శోభాడే వెంట‌నే ట్వీట్‌ను డిలీట్ చేశారు. అయితే అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగింది.

మెగా హీరోల‌ను ఏదైనా మాటంటేనే ఊరుకోని అభిమానులు ఇక ఇలాంటి ట్వీట్ చేస్తే ఊరుకుంటారా? త‌మ‌దైన శైలిలో శోభాడేను సోష‌ల్ మీడియాలో ట్రోల్ చేయ‌డం ప్రారంభించారు. ఇలాంటి విష‌యాలను పోస్ట్ చేసేట‌ప్పుడు కాస్త జాగ్రత్త వ‌హించాల‌ని లేకుంటే ఇలాంటి ప‌రిస్థితులే ఎదుర‌వుతాయని అర్థ‌మ‌వుతుంది.

చిరంజీవి సర్జా సీనియ‌ర్ న‌టుడు అర్జున్‌కి మేన‌ల్లుడు అవుతాడు. చిన్న వ‌య‌సులో గుండెపోటుతో క‌న్నుమూయ‌డం యావ‌త్ సినీ ప్ర‌పంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.