అభిమానులే కాదు పుస్తక ప్రియులెవరైనా సరే చదవాల్సిన పుస్తకం మెగా చిరంజీవితం 150
- IndiaGlitz, [Thursday,January 19 2017]
మెగాస్టార్ చిరంజీవి గురించి, ఆయన సినిమా ప్రస్ధానం గురించి గతంలో కొన్ని పుస్తకాలు వచ్చాయి. అయితే...తాజాగా చిరంజీవి 150వ చిత్రం విడుదల సందర్భంగా సీనియర్ పాత్రికేయుడు పసుపులేటి రామారావు రాసిన సరికొత్త పుస్తకం మెగా చిరంజీవితం - సినీ ప్రస్ధానం 150. గతంలో ఈ రచయిత చిరంజీవి పై ఓ పుస్తకాన్ని తీసుకువచ్చారు. అయితే ఆ పుస్తకానికి పూర్తి భిన్నంగా 120 కలర్ పేజీలతో 220 బ్లాక్ & వైట్ పేజీలతో రంగుల వైభవం అన్నట్టుగా ఈ మెగా చిరంజీవితం 150 పుస్తకాన్ని తీసుకురావడం విశేషం. చిరంజీవి మొదటి చిత్రం నుండి ఆయనతో విశేషమైన సన్నిహితం కలిగిన రామారావు మెగాస్టార్ చిరంజీవి గురించి సమగ్రమైన సమాచారాన్ని ఇవ్వడమే కాకుండా కొంతమంది సినీ ప్రముఖుల అభిప్రాయలు తీసుకున్నారు. ఇంతకన్నా మెరుగుగా, ఇంతకన్నా సమగ్రంగా మరెవ్వరూ సమాచారాన్ని ఇవ్వలేరనంత గొప్పగా ఈ పుస్తకాన్ని తీర్చిదిద్దారు పసుపులేటి రామారావు.
ముఖ్యంగా పుస్తకం కవర్ పేజీ నుండి చిట్ట చివరి పేజీ వరకు పాఠకులను ఆకట్టుకునే పుస్తకం ఇది. పుస్తకంలోని కలర్ పేజీలన్నీ ఎంతో ముచ్చటగా ఉండి కనువిందు చేస్తాయి. చిరంజీవి నటించిన మొత్తం 150 చిత్రాల పోస్టర్లను పేజీకొకటి చొప్పున రంగులలోనే ముద్రించడం మామూలు విషయం కాదు. రచయిత రామారావు ఖర్చుకు వెనకాడకుండా మెగా స్ధాయిలోనే ఈ పుస్తకాన్ని తీసుకువచ్చినందుకు ఆయన ధైర్య సాహసాలను అభినందించక తప్పదు. అలాగే 220 బ్లాక్ & వైట్ పేజీలను కూడా అనేక ఫోటోలతో అందంగా అలంకరించారు. ప్రత్యేకంగా ఈ పుస్తకం కోసం చిరంజీవి ఇచ్చిన ఇంటర్ వ్యూ, అలాగే ఇంటర్ వ్యూలకు ఆమడ దూరంలో ఉండే అల్లు అరవింద్ ఇచ్చిన ఇంటర్ వ్యూ ఈ పుస్తకానికి హైలెట్స్. చూడగానే కొనాలనిపించే పుస్తకం. కొనగానే చదవాలనిపించే పుస్తకం. చదవగానే పూర్తి సంతృప్తినిచ్చే పుస్తకం మెగా చిరంజీవితం 150. అయితే...ఇంత భారీగా తీసుకువచ్చిన ఈ పుస్తకం 300 రూపాయలు మాత్రమే. అన్ని ప్రధాన పుస్తకాల షాపుల్లో అందుబాటులో ఉన్నాయని రచయిత తెలియచేస్తున్నారు.