కరోనా మహమ్మరికి ఔషధం సిద్ధం.. త్వరలోనే మార్కెట్‌లోకి..
- IndiaGlitz, [Sunday,June 21 2020]
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి ఔషధం సిద్ధమైంది. భారత ఫార్మా దిగ్గజ కంపెనీ గ్లెన్ మార్క్ ఈ కరోనాకు ఔషధాన్ని తయారు చేసినట్టు వెల్లడించింది. ఇప్పటికే మూడు దశల్లో క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపింది. కరోనాపై ఫాబిఫ్లూనే తొలి ఓరల్ ఔషధమని ముంబయికి చెందిన గ్లెన్‌మార్క్ ఫార్మా సంస్థ వెల్లడించింది. ఈ ఔషధం స్వల్ప, మధ్యస్థ కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారికి బాగా పని చేస్తుందని వెల్లడించింది. ఫాబిఫ్లూ బ్రాండ్ పేరిట ఈ ఔషధాన్ని మార్కెట్లోకి విడుదల చేసేందుకు అవసరమైన అనుమతులను శుక్రవారం భారత ఔషధ నియంత్రణ సంస్థ నుంచి పొందినట్టు వెల్లడించింది.
సాధ్యమైనంత త్వరగా ఈ ఔషధాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తమ సంస్థ కేంద్ర ప్రభుత్వంతో కలిసి పని చేస్తోందని గ్లెన్‌మార్క్ ఛైర్మన్ గ్లెన్ సల్దన్హా తెలిపారు. అయితే వైద్యుల ప్రిస్కిప్షన్ ఆధారంగా మాత్రమే ఈ ఔషధాన్ని విక్రయించనున్నట్టు గ్లెన్ మార్క్ తెలిపింది. ఒక్కో ట్యాబ్లెట్ ధర రూ.103 ఉంటుందని తెలిపింది. తొలిరోజు 1800 ఎజీ పరిమాణాన్ని రోజుకు రెండు సార్లు, అనంతరం రెండు వారాల పాటు 800 ఎంజీ పరిమాణం చొప్పున వాడాల్సి ఉంటుందని తెలిపింది. ఫాబిప్లూ ఔషధాన్ని గుండె జబ్బులున్నవారితోపాటు, డయాబెటిక్ పేషెంట్లు సైతం వాడొచ్చని గ్లెన్ మార్క్ పేర్కొంది.