Doctor Preethi : ముగిసిన ప్రీతి పోరాటం.. చికిత్స పొందుతూ మరణించిన వైద్య విద్యార్ధిని, నిమ్స్ డాక్టర్ల ప్రకటన
Send us your feedback to audioarticles@vaarta.com
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ విద్యార్ధిని డాక్టర్ ప్రీతి కన్నుమూశారు. సీనియర్ వేధింపులతో ఆత్మహత్యాయత్నం చేసిన ఆమె గత ఐదు రోజులుగా హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో ఆదివారం ప్రీతి ఆరోగ్య పరిస్ధితి పూర్తిగా విషమించింది. ఆమె శరీరం చికిత్సకు సహకరించడం మానేసింది. ఆమెను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమించారు. ఈ నేపథ్యంలో రాత్రి 9.10 గంటలకు బ్రెయిన్ డెడ్ అయి ప్రీతి మరణించినట్లు నిమ్స్ వైద్యులు ప్రకటించారు. ఆమెను కాపాడేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశామని.. కానీ కాపాడలేకపోయామని నిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్‌లో వెల్లడించారు. దీంతో ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు , తోటి విద్యార్ధులు కన్నీటి పర్యంతమయ్యారు.
అసలేం జరిగిందంటే :
వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ)లో పీజీ చదువుతోన్న ప్రీతి .. సీనియర్ విద్యార్ధి వేధింపులు భరించలేక ఫిబ్రవరి 22న ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రమాదకర ఇంజెక్షన్ తీసుకుని అపస్మారక స్థితికి చేరుకుంది. దీనిని గమనించిన తోటి విద్యార్ధులు ఆమెను హుటాహుటిన వరంగల్ ఎంజీఎంకు తరలించారు . అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. రోజులు గడుస్తున్నా.. ప్రీతి ఆరోగ్యంలో ఎలాంటి మార్పూ రాలేదు. మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యాయని, వెంటిలేటర్‌పై, ఎక్మో సాయంతో చికిత్స అందిస్తున్నామని డాక్టర్లు చెబుతూ వచ్చారు. ఈ దశలో గవర్నర్ తమిళిసై సహా మంత్రులు, రాజకీయ పార్టీల నేతలు నిమ్స్‌లో ప్రీతి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
మృతదేహం తరలింపు విషయంలో హైడ్రామా:
ప్రీతి మరణవార్తను జీర్ణించుకోలేని కుటుంబ సభ్యులు, బంధువులు, తోటి విద్యార్థులు ఆమెకు న్యాయం జరగాలంటూ పట్టుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే వరకు మృతదేహాన్ని తరలించేందుకు వీలు లేదని విద్యార్ధి సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. వారికి నచ్చజెప్పేందుకు పోలీసులు ఎంతగా ప్రయత్నించినా విఫలం కావడంతో.. మంత్రులు రంగంలోకి దిగి పరిస్ధితిని చక్కదిద్దారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments