Chiranjeevi:మరోసారి పెద్ద మనసు చాటుకున్న చిరంజీవి .. ‘బలగం’ మొగిలయ్య వైద్యానికి ఆర్ధిక సాయం
- IndiaGlitz, [Tuesday,April 18 2023]
మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియనివారుండరు. స్వయంకృషి, పట్టుదల, క్రమశిక్షణతో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా తెలుగు సినీ పరిశ్రమలో స్టార్‌గా ఎదిగారు. దాదాపు మూడు దశాబ్ధాల పాటు టాలీవుడ్‌ను మకుటం లేని మహారాజుగా ఏలారు. ఒకానొక దశలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్‌ను మించిన స్థార్‌గా, ఆయన కంటే ఎక్కువ పారితోషికం తీసుకునే నటుడిగా చిరంజీవి సంచలనం సృష్టించారు. అయితే ఎంత ఎదిగినా ఒదిగివుండే తత్వం, మంచితనం, మానవత్వం మెగాస్టార్ సొంతం. అందుకే ఆయనను స్పూర్తిగా తీసుకుని ఎంతోమంది హీరోలు, టెక్నీషియన్లు వెండితెరపైకి వచ్చారు.. వస్తున్నారు.
బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకులతో సమాజసేవ:
ఇకపోతే.. తనను ఈస్థాయికి తీసుకొచ్చిన సమాజానికి, భారతదేశానికి ఎంతో కొంత సాయం చేయాలనే ఉద్దేశంతో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ పేరిట ఆయన బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ నిర్వహిస్తూ లక్షలాది మంది ప్రాణాలను నిలబెట్టారు. ఇక కరోనా సమయంలో కోట్లాది రూపాయలను ఖర్చుపెట్టి.. ఆక్సిజన్ ప్లాంట్‌లు, రెమిడిసెవర్ వంటి మందులను అందించి ఎంతోమందికి ప్రాణదానం చేశారు. అంతేకాదు ఇండస్ట్రీలోని తన తోటి కళాకారులు ఎవరు కష్టాల్లో వున్నా సరే వారికి తనకు చేతనైనంత సాయం చేస్తున్నారు చిరు. మొన్నామధ్య తమిళ నటులు పాకీజా, పొన్నాంబలంలకు సాయం చేసి పెద్ద మనసు చాటుకున్నారు మెగాస్టార్.
బలగం మొగిలయ్య వైద్యానికి ఖర్చు భరిస్తాన్న చిరు :
తాజాగా మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు చిరంజీవి. బలగం సినిమా ద్వారా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మొగిలయ్య అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. తొలుత కిడ్నీలు పాడవ్వగా.. డయాలిసిస్ చేస్తుండగా గుండెపోటు రావడంతో ఆయనను హుటాహుటిన వరంగల్ నుంచి హైదరాబాద్‌కు తరలించారు. మంత్రి హరీశ్ రావు తదితర పెద్దల సాయంతో మొగిలయ్యకు చికిత్స అందుతోంది. అయితే అనారోగ్యంత కారణంగా మొగిలయ్యకు కంటిచూపు మందగించినట్లుగా తెలుస్తోంది. ఈ విషయం మెగాస్టార్ దృష్టికి రావడంతో చిరు వెంటనే బలగం డైరెక్టర్ వేణుకు ఫోన్ చేసి మొగిలయ్య ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు.. మొగిలయ్య కంటి చూపు వచ్చేందుకు అవసరమైన చికిత్సకు ఎంత ఖర్చయినా తాను భరిస్తానని చిరు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని దర్శకుడు వేణు.. మొగిలయ్య కూడా చెప్పినట్లుగా ఫిలింనగర్ లో చర్చ జరుగుతోంది. ఇదంతా జరిగి చాలా కాలం అవుతున్నా .. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.