Download App

MCA Review

వరుస విజయాల నాని, సక్సెస్‌ఫుల్‌ నిర్మాత దిల్‌రాజు కాంబినేషన్‌లో సినిమా అనగానే సినిమా ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందోనని ఆసక్తి ముందుగానే క్రియేట్‌ అయ్యింది. అందుకు తగినట్లు టైటిల్‌, నాని లుక్‌ సినిమాపై మంచి అంచనాలనే క్రియేట్‌ చేశాయి. ఈ ఏడాది ఐదు సక్సెస్‌లు కొట్టాను ఆరో సక్సెస్‌ కోసం వెయిట్‌ చేస్తున్నాను..ఎంసీఏ సక్సెస్‌ కొడతాను అని దిల్‌రాజు నమ్మకంగా ఉన్నారు. అలాగే 'ఫిదా'తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సాయిపల్లవి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించడంతో పాటు, భూమిక వదినగా ఈ సినిమాలో రీ ఎంట్రీ ఇచ్చింది. మరి దిల్‌రాజు కోరిక నేర వేరి ఆయనకు ఆరో హిట్‌ దక్కుతుందా? లేదా? అని తెలుసుకోవాలంటే ముందు కథేంటో చూద్దాం..

కథ:

అమ్మనాన్నలు చనిపోవడంతో రాజీవ్‌ కనకాల..తమ్ముడు నాని(నాని)కి అన్నీ తానై పెంచి పెద్ద చేస్తాడు. నానికి కూడా అన్నయ్య అంటే ఎంతో ప్రాణం. అన్నయ్య జ్యోతి(భూమిక)ని పెళ్లి చేసుకోవడంతో ప్రాధాన్యతలు మారుతాయి. నాని కూడా అన్నయ్యను అపార్థం చేసుకుని హైదరాబాద్‌లోని బాబాయ్‌(నరేష్‌), పిన్ని(ఆమని) ఇంటికి వెళ్లిపోతాడు. రవాణాశాఖలో ఆఫీసర్‌ అయిన జ్యోతికి వరంగల్‌ ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది. ఆ సమయంలో అన్నయ్యకు ఢిల్లీలో ట్రైనింగ్‌ ఉండటంతో, వదినకు తోడుగా నాని వరంగల్‌ వెళతాడు. జ్యోతి ఇంటి పనులన్నింటినీ..నానితోనే చేయిస్తుంది. దాంతో తనని, వదిన పని మనిషిగా చూస్తుందని భావించిన నాని, ఆమెను తప్పుగా అర్థం చేసుకుంటాడు. అదే సమయంలో వరంగల్‌లోని జ్యోతి చెల్లెలు పల్లవి(సాయి పల్లవి)తో ప్రేమలో పడతాడు. అయితే ముందుగా జ్యోతి బాబాయ్‌ కూతురే పల్లవి అని నానికి కూడా తెలియదు. కథ ఇలా ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సాగుతున్న క్రమంలో..వీరి జీవితంలో శివ(విజయ్‌ వర్మ) ప్రవేశిస్తాడు. శివశక్తి ట్రావెల్స్‌ అధినేత అయిన శివ బస్సులు అక్రమంగా సిటీలో తిరుగుతున్నాయని తెలుసుకున్న జ్యోతి వాటిని సీజ్‌ చేస్తుంది. దాంతో జ్యోతిని చంపడానికి శివ ఆమె ఆఫీస్‌కే వస్తాడు. అదే సమయంలో బాబాయ్‌ కారణంగా..వదిన మంచితనం తెలుసుకున్న నాని, ఆమెకు థాంక్స్‌ చెప్పడానికి అక్కడికి వచ్చి, సిచ్యువేషన్‌ను అర్థం చేసుకుని, శివ అండ్‌ గ్యాంగ్‌ పనిపడతాడు. పరిస్థితి ఇంకా సీరియస్‌ అవుతుంది. పదిరోజుల్లో జ్యోతిని చంపుతానని శివ అంటాడు. అదే పది రోజులు వదినను కాపాడుకుంటానని..అలా కాపాడుకుంటే తర్వాత ఏం చేయకుండా వదిలేయాలని నాని పందెం కాసుకుంటారు. ఆ పందెంలో ఎవరిది పైచేయి అవుతుంది? వదినకు తెలియకుండా, ఆమెను కాపాడే ప్రయత్నంలో నాని ఎదుర్కొనే పరిస్థితులేంటి? ఈ క్రమంలో నాని, తన ప్రేమను ఎలా గెలుచుకుంటాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

ప్లస్‌ పాయింట్స్‌:

నటీనటులు పరంగా నాని ఫుల్‌ ఎనర్జీతో సినిమా మొత్తాన్ని ముందుండి నడిపించాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో అలరించాడు. ఇక డాన్సులు పరంగా మెప్పించాడు. అలాగే సాయిపల్లవి..తను కనపడ్డ సీన్స్‌ పరంగా తనదైన ముద్ర వేసి ఆకట్టుకుంది. ఇక డాన్సులు బాగా చేసింది. ఫిదా సినిమాతో ఆమెకున్న క్రేజ్‌ ఈ సినిమాకు మరింత ప్లస్‌ అవుతుంది. ఇక ఇప్పటి వరకు సినిమా హీరోయిన్‌గా నటించిన భూమిక ఈ సినిమాలో వదిన పాత్రలో అలరించింది. భూమిక పాత్రను చాలా చక్కగా డిజైన్‌ చేశారు. ఇక ఫస్టాఫ్‌లో వచ్చే కామెడీ సీన్స్‌ ప్రేక్షకులను నవ్విస్తాయి. సినిమాటోగ్రఫీ బావుంది. విజువల్స్‌ను బాగా చూపించారు.

మైనస్‌ పాయింట్స్:

హీరో నాని ఎనర్జికి సినిమా ఆసాంతం బావున్నా, కొన్సి సీన్స్‌లో ఓవర్‌ బిల్డప్‌ చేసేశారనిపించింది. వదిన అంటే గౌరవముండే వ్యక్తి, ఆమె వెనుక చేతులు ట్టుకుని ఎందుకు నడవాలో అర్థం కాదు. అలాగే చేతులు కట్టుకునే విలన్‌కు నమస్తే చెప్పడం ఇలాంటి సీన్స్‌లో నాని పాత్ర చాలా ఎక్కువ చేసినట్లు అనిపించింది. ఇక కథ పరంగా కొత్త కథేం కాదు. పక్కా రొటీన్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌. విలన్‌ పాత్రను ఎస్టాబ్లిష్‌ చేసిన దానికి తెరపై చూపించిన దానికి సంబంధమే ఉండదు. కొన్ని సీన్స్‌ లాజిక్‌కి దగ్గరగా కూడా ఉండదు. ఇక దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అంత ఎఫెక్టివ్‌గా అనిపించలేదు. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా ఆకట్టుకోలేదు. హీరో విలన్‌ బారి నుండి తన కుటుంబాన్ని కాపాడుకునే సినిమాలను చాలానే చూశాం. అయితే అందుకు భిన్నంగా ఈ సినిమాలో హీరో తన వదినను కాపాడుకుంటాడంతే. అంతే తప్ప కథలో కొత్తదనం కనపడదు.

సమీక్ష:

ఫస్టాఫ్‌లో నాని, రాజీవ్‌ కనకాల మధ్య వచ్చే సీన్స్‌ కామెడీతో ప్రేక్షకులను నవ్విస్తాయి. అలాగే సాయిపల్లవి, నానికి ప్రేమను చెప్పే సందర్భం..అతన్ని టీజ్‌ చేసే సీన్స్‌ కామన్‌ ఆడియెన్‌కు నచ్చుతాయి. అలాగే హీరోయిన్‌ ఫోన్‌ కోసం హీరో టవర్‌ దగ్గర వెయిట్‌ చేసే సీన్‌.. వదిన మంచి తనం గురించి నరేష్‌, నానికి వివరించే సీన్‌ అన్ని ప్రేక్షకులను మెప్పిస్తాయి. ఇక విలన్‌ మనస్తత్వాన్ని పెద్ద బిల్డప్‌గా చూపించిన దర్శకుడు కొన్ని సీన్స్‌ను లాజిక్స్‌ లేకుండా చూపించాడు. ఖరీదైన కారులుండగా అసలు విలన్‌ ఎందుకు మినీ బస్‌లో ప్రయాణిస్తాడో ప్రేక్షకుడికి అర్థం కాదు. అలాగే విలన్స్‌ బారి నుండి గ్యాస్‌ లీక్‌ చేసి హీరో వదినను కాపాడుకుంటాడు. అంత వరకు బానే ఉంది. మరి ఆ సీన్‌లో హీరో చనిపోతే..మరి మెయిన్‌ విలన్‌ హీరో వదినను చంపకుండా ఉంటాడా? అప్పుడు హీరో చేసిన చాలెంజ్‌ ఏమవుతుంది..ఇలాంటి లాజిక్స్‌ కథలో కనపడవు. దర్శకుడు కథను మిడిల్‌క్లాస్‌ నేపథ్యంలో చక్కగానే రాసుకున్నాడు. అయితే సెకండాఫ్‌ అంత ఎఫెక్టివ్‌గా అనిపించలేదు. సాయిపల్లవి పాత్ర నటన పరంగా పెద్దగా చేసిందేమీ లేదు. ఈ సినిమాలో సాయిపల్లవి చక్కగా డ్యాన్సులు చేసింది. ముఖ్యంగా ఎవండోయ్‌ చిన్నిగారు..చెప్పండోయ్‌ నానిగారు..అంటూ సాగే పాటలో సాయిపల్లవి వేసిన స్టెప్‌ డాన్స్‌ ప్రియులను అలరిస్తుంది. మొత్తంగా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ చూడాలనుకునే ప్రేక్షకులు సినిమా బాగా ఎంజాయ్‌ చేస్తారు.

బోటమ్‌ లైన్‌: ఎంసీఏ..జస్ట్‌ ఓకే

MCA Movie Review in English

 

Rating : 2.8 / 5.0