'మయూరి' మూవీ రివ్యూ
Send us your feedback to audioarticles@vaarta.com
నటీనటులు: నయనతార, ఆరీ, మైమ్ గోపీ, లక్ష్మీ ప్రియ, చంద్రమౌళి, రోబో శంకర్, శరత్ తదితరులు
తెలుగులో నిర్మాణం: సి.కె.ఎంటర్టైన్మెంట్స్, శ్రీ శుభశ్వేత ఫిలిమ్స్,
దర్శకత్వం: అశ్విన్ శరవణన్
నిర్మాతలు: శ్వేతలానా, వరుణ్ , తేజ, సి.వి.రావు
సంగీతం: రాన్ ఎథిన్ యోహాన్
ఆర్ట్: రామలింగం
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కోనేరు కల్పన
కెమెరా: సత్యన్ సూర్యన్
హారర్ సినిమా అనగానే హీరోయిన్లు చిట్టిపొట్టి డ్రస్సులు వేసుకోవడం, నలుగురు గ్యాంగ్ అడవుల్లోకి వెళ్ళడం, వారికి అక్కడ ఏదో కనిపించడం, వీరిని చంపడం అనేది ఫార్ములాగా మారింది. కానీ మయూరి వీటన్నిటికీ కాస్త భిన్నంగా వెళ్తుంది. మాయ, మయూరిగా నయనతార నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుందో తెలుసుకోవాలంటే చదవండి మరి..
కథ
మయూరి (నయనతార) అప్ కమింగ్ సినిమా ఆర్టిస్ట్. ఆమె భర్త అర్జున్ (ఆరి) కూడా ఆర్టిస్టే. వీరిద్దరికి మీరా అనే ఏడాది పాప ఉంటుంది. మీరా పుట్టుక విషయంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోతారు. అప్పటి నుంచి మయూరిని స్వాతి చేరదీస్తుంది. మయూరి కెరీర్ కు కూడా సాయం చేస్తుంది. కానీ మయూరిని అప్పుల బాధలు వెంబడిస్తుంటాయి. రాత్రిపూట బ్రేక్ లేకుండా ఒకటిన్నర గంట హారర్ సినిమా చూసిన వారి పల్స్ రేట్ లో తేడా లేకపోతే వారికి రూ5లక్షలు బహుమతిని ఇస్తామని స్వాతి బాస్ అయిన ఓ డైరక్టర్ ప్రకటిస్తాడు. ఆ సమయంలోనే మయూరికి రావాల్సిన డబ్బుల చెక్ బౌన్స్ అవుతుంది.
ఆ చెక్కును ఇచ్చిన నిర్మాత ఒంటరిగా హారర్ సినిమా చూడటానికి సిద్ధపడి హార్ట్ ఎటాక్ తో చనిపోతాడు. అప్పుల వారు మీద పడటంతో ఏం చేయాలో తోచని మయూరి హారర్ సినిమా చూడటానికి సిద్ధపడుతుంది. ఆ సినిమా చూసిన అంతకు ముందే నిర్మాత చనిపోయిన విషయాన్ని గుర్తు చేసి వద్దని వారిస్తుంది స్వాతి. అయితే మయూరి ఆ సినిమా చూడటం వల్ల చాలా విషయాలు తెలుస్తాయి. అందులో ప్రధానమైనది మాయవనం. అందులో చనిపోయిన మాయ ఉదంతం. మాయకి , మయూరికి సంబంధం ఏమిటి? ఒంటరిగా సినిమా చూసిన వారికి అనుభవంలోకి వచ్చిన విషయాలేంటి? మయూరి ఆ సినిమాను చూసిందా? ముందు అంగీకరించిన విధంగానే దర్శకుడు ఆమెకు డబ్బులు ఇచ్చాడా? ఆమె భర్త అర్జున్ కి , మయూరికి ఉన్న మనస్పర్థలు తొలగిపోయాయా? వంటివన్నీ ఆసక్తికరం.
ప్లస్ పాయింట్స్
ప్లాట్ కొత్తగా ఉంది. అశైలం అనే ప్రాంతంలో మానసిక వికలాంగులకు జరిగిన అన్యాయాలను గురించి రేఖామాత్రంగానైనా చెప్పడం బావుంది. ఆర్ట్ వర్క్ సినిమాకు ప్లస్ పాయింట్. మ్యూజిక్ డైరక్టర్ పనితనం ఎవరినైనా ఇట్టే ఆకట్టుకోవాల్సిందే. హారర్ థ్రిల్లర్లకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రాణం. ఆ ప్రాణానికి ప్రాణం పోశాడు రాన్ ఎథాన్. నయనతార లుక్ బావుంది. పాపకు తల్లిగా, భర్తకు దూరంగా ఉన్న వివాహితగా, సినిమాల్లో లక్ ను టెస్ట్ చేసుకునే నటిగా, సమస్యలతో సతమతమవుతూ ఒంటరితనంతో పోరాడే మహిళగా చాలా చక్కగా అభినయించింది. మైమ్ గోపి, ఆరి, రోబో శంకర్ తమ పాత్రల్లో మెప్పించారు. కెమెరా కూడా బావుంది. బ్లాక్ అండ్ వైట్, కలర్ సన్నివేశాలను చూపిస్తూ ఓ మూడ్ ను క్రియేట్ చేశాడు దర్శకుడు.
మైనస్ పాయింట్స్
సినిమా చూసి బయటికి వచ్చిన వారికి కథ ఏంటో అర్థం కాదు. సినిమాలో దర్శకుడు ఏం చెప్పాడో అర్థం కాదు. ఓ తల్లి తన బిడ్డను నీడలా వెంటాడుతుంది. నినువీడని నీడను నేను అంటూ కాపాడుకుంటుంది అనేది మాత్రం అర్థమవుతుంది. అంతకు మించి ఏ సీన్, ఎక్కడ ఎందుకొస్తుందో అర్ధం కాదు. మయూరి సినిమాలో చీకటి అనే ఒక సినిమాని చూపించారు. చీకటి ఎప్పుడు ప్లే అవుతుందో, మయూరి ఎక్కడ ప్లే అవుతుందో మనకే కన్ఫ్యూజన్గా ఉంటుంది. దర్శకత్వం బాగా లేదు. ఎడిటింగ్ అసలు బాగా లేదు. ఒకవేళ ఇది కొత్త తరహా సినిమా అని ఎవరైనా చెప్పినా ముందు అర్థమైతే కదా, ప్రజల్లోకి ఎక్కడానికి?
విశ్లేషణ
నయనతార రెండు పాత్రల్లో కనిపిస్తుందని అన్నారు. కానీ నయనతార మయూరిగానే కనిపించింది. మాయ కాళ్ళు, చేతులు తప్ప ముఖం అసలు కనిపించదు. ఓ డైరీలో ఓ పాత ఫోటో మాత్రం ఉంటుంది. ఆ ఫోటోలో నయన్ చూడ్డానికి బ్రిటిష్ యువరాణిలా అందంగా ఉంటుంది.ఎంతసేపూ తెరపై చూడ్డానికి అందంగా కనిపించాలనుకున్న నయనతార రగ్డ్ లుక్ కు ఓకే చెప్పినట్టు లేదు. ఆమె ఓకే చేసి ఉంటే జుత్తు, మాసిన చీరను మాత్రమే డైరక్టర్ ఎందుకు చూపించేవాడు? నిను వీడని నీడను నేను అనేది పాత సినిమాలో వచ్చిన దెయ్యం పాట. ఆ పాటను నెగటివ్ సెన్స్ తో వాడారు. కానీ ఆ ఫంక్తులను ఈ సినిమాలో పాజిటివ్ సెన్స్ తో వాడటం మింగుడు పడదు.
ఒక్క మాటలో చెప్పాలంటే మాయ మన దగ్గర ఎ సెంటర్ వారికి కూడా సరిగా అర్థం కాదు. సినిమా చూసేవారు ఆ సినిమాలోకి ఎలా వెళ్తారు? సినిమా చూడటానికి వచ్చిన నిర్మాత అక్కడ తెరపైన కదిలే పాత్రలతో మమేకమై కదులుతుంటాడు. పరుగులు తీస్తాడు. అలాగే మయూరి కూడా సినిమా చూస్తూ తెరమీదకు వెళ్ళి అక్కడి పాత్రలతో మమేకమవుతుంది. అక్కడి మాయావనం నుంచి తన తల్లి డైరీని, బొమ్మను తెచ్చుకుంటుంది. ఎంతటి హారర్ సినిమా అయినా లాజిక్ లను ఇలా మిస్ కావడాన్ని సామాన్య ప్రేక్షకుడు జీర్ణించుకోలేడు. సినిమా నిడివిని తప్పక తగ్గించాలి. సింఫనీలో రికార్డు చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోరుకు తప్పక మంచి అప్లాజ్ వస్తుంది. మ్యూజిక్ డైరక్టర్ కి చక్కటి భవిష్యత్తు ఉంది.
రేటింగ్: 2.25/5
బాటమ్ లైన్: కన్ఫ్యూజింగ్ మయూరి
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments